Share News

వైద్యశాఖలో ఉద్యోగోన్నతులపై 22న విచారణ

ABN , Publish Date - May 19 , 2025 | 01:37 AM

జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని సచివాలయ ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ఈనెల 22న విచారణ జరగనుంది. ఈమేరకు విచారణాధికారి అయిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌/ఎస్‌డీసీ మాధురి సంబంధిత అధికారులకు నోటీసులు పంపారు.

వైద్యశాఖలో ఉద్యోగోన్నతులపై 22న విచారణ

నోటీసులు జారీచేసిన ఎస్‌డీసీ

ఒంగోలు కలెక్టరేట్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని సచివాలయ ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ఈనెల 22న విచారణ జరగనుంది. ఈమేరకు విచారణాధికారి అయిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌/ఎస్‌డీసీ మాధురి సంబంధిత అధికారులకు నోటీసులు పంపారు. మార్చిలో నిర్వహించిన సచివాలయ ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా చెన్నయ్య కొద్దిరోజుల క్రితం జేసీ గోపాలకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. సీనియారిటీ జాబితాలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. స్పందించిన జేసీ.. ఉద్యోగోన్నతులపై సమగ్ర విచారణ చేసి నివేదికను అందజేయాలని ఎస్‌డీసీ మాధురిని ఆదేశించారు. దీంతో ఈనెల 11న ఆమె విచారణకు సిద్ధమ య్యారు. ఆరోజు జిల్లాకు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఒంగోలు రావడంతో ఆ విచారణను వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 22వతేదీ సాయంత్రం నాలుగు గంటలకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించాలని మాధురి నిర్ణయించారు. ఈమేరకు ఫిర్యాదుదారుడు బిళ్లా చెన్నయ్యతో పాటు వైద్యశాఖ అధికారులు, ఉద్యోగోన్నతులు నిర్వహించిన కమిటీ సభ్యులకు కూడా నోటీసులు పంపినట్లు సమాచారం. ఉద్యోగోన్నతుల మెరిట్‌ జాబితాలతోపాటు అందుకు సంబంధించిన అన్ని పైళ్లను అందుబాటులో ఉంచాలని ఆ నోటీసుల్లో ఆమె సూచించారు. ఇదిలా ఉండగా కొంతమంది అర్హత లేకపోయినా ఉద్యోగోన్నతులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాని వెనుక పెద్దమొత్తంలో డబ్బులు కూడా చేతులు మారినట్లు తెలుస్తోంది. ఫోన్‌ పేలో కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరుల ద్వారా వసూళ్లు చేశారన్న ప్రచారం కూడా నడుస్తోంది. దీనిపై కూడా ఎస్‌డీసీ విచారణ చేయయనున్నట్లు సమాచారం.

Updated Date - May 19 , 2025 | 01:37 AM