Share News

పారిశ్రామిక ప్రగతి

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:14 AM

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే దొనకొండలో పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు పడుతున్నాయి. వరుసగా కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తోంది. ఇటీవల సోలార్‌, తర్వాత రక్షణ రంగం నుంచి భారీ పరిశ్రమ, తాజాగా క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌.. ఇలా ఒకదాని వెంట మరొక ప్రాజెక్టు రాబోతున్నాయి.

పారిశ్రామిక ప్రగతి
దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములు

దొనకొండకు వరుసగా ప్రాజెక్టులు

తొలుత సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌ ప్రకటన

ఇటీవల రక్షణ రంగానికి చెందిన భారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన బీడీఎల్‌ సంస్థ

తాజాగా ప్రపంచ స్థాయి క్యాన్సర్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు

ప్రజాప్రభుత్వంలో చిగురిస్తున్న ఆశలు

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎండమావిగా అభివృద్ధి

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే దొనకొండలో పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు పడుతున్నాయి. వరుసగా కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తోంది. ఇటీవల సోలార్‌, తర్వాత రక్షణ రంగం నుంచి భారీ పరిశ్రమ, తాజాగా క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌.. ఇలా ఒకదాని వెంట మరొక ప్రాజెక్టు రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అన్నిరంగాల్లో వెనుకబడిన దొనకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, జీవనోపాధి నిమిత్తం పేద ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వలసలను నివారించాలన్నా పరిశ్రమల ఏర్పాటు ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజాప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ప్రాజెక్టులు తీసుకువస్తుండటం దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది.

దొనకొండ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : దొనకొండలో భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుతోపాటు బీడీఎల్‌కు చెందిన పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. తాజాగా క్యాన్సర్‌ రీసెర్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సౌత్‌ కొరియాకు చెందిన సంస్థ, చల్లా గ్రూపులతో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) దొనకొండలో రెండు దశలుగా రూ.1,200 కోట్ల పెట్టుబడితో క్షిపుణుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అందుకు 1,400 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,600 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులన్నీ సకాలంలో వస్తే ఏడాదిలో పరిశ్రమ పనులను ప్రారంభించి, రెండేళ్లకు పూర్తి చేసేలా ఆ సంస్ధ ప్రతిపాదించినట్లు తెలిసింది. అందులోభాగంగా ఇటీవల డీఆర్‌డీవోకు చెందిన ప్రతినిధులు దొనకొండకు వచ్చి ఈ ప్రాంతంలోని భూములు, మౌలిక సౌకర్యాలను క్షుణ్ణంతగా పరిశీలించి భూములకు సంబందించిన పూర్తి సమాచారాన్ని కనిగిరి ఆర్డీవో, స్థానిక తహసీల్దార్‌ ద్వారా తెలుసుకున్నారు.

ప్రపంచ స్థాయి క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు

సీఎం చంద్రబాబునాయుడు పిలుపు మేరకు దొనకొండ ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,260 కోట్లతో ప్రపంచస్థాయి క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్‌ స్మార్ట్‌ సిటీస్‌ ఫోరం చైర్మన్‌ వెల్లడించారు. చల్లా గ్రూప్స్‌ సంస్థల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడలో సోమవారం ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేంద్రంలో 1,500 పడకలతో ఇన్‌ పేషెంట్‌ వార్డు, క్యాన్సర్‌ శస్త్ర చికిత్సలు, మెడికల్‌ స్కూల్‌, నివాస సముదాయం, బొటానిక్‌ గార్డెన్‌ తదితరాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా దాదాపు 4వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఆ ఐదేళ్లు ప్రగతి శూన్యం.. మళ్లీ ప్రారంభం

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు దొనకొండ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నాడు అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎందరో విదేశీ ప్రతినిధుల బృందాలు పర్యటించి పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పారిశ్రామిక ప్రగతి ఎండమావిగా మారింది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చూపుతున్న చొరవతో దొనకొండ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలో దొనకొండ దశ మారి బంగారు కొండగా అభివృద్ధి చెందటం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు.

Updated Date - Nov 05 , 2025 | 01:14 AM