సాగర్ కాలువలకు పెరిగిన నీటి ప్రవాహం
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:17 AM
సాగర్ కాలువలకు నీటి పరిమా ణాన్ని ఎట్టకేలకు పెంచారు. జిల్లా సరిహద్దుకు చెప్పిన మాట ప్రకారం అధికారులు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సాగర్ కాలువలకు నీటి పరిమాణం పూర్తిగా తగ్గడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురిత మయ్యాయి.
జిల్లా సరిహద్దు వద్ద 2,600 క్యూసెక్కులు విడుదల
దర్శి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : సాగర్ కాలువలకు నీటి పరిమా ణాన్ని ఎట్టకేలకు పెంచారు. జిల్లా సరిహద్దుకు చెప్పిన మాట ప్రకారం అధికారులు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సాగర్ కాలువలకు నీటి పరిమాణం పూర్తిగా తగ్గడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురిత మయ్యాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకొన్నారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్‌ప్రసాద్ జిల్లాకు నీటి పరిమాణం పెంచాలని ఆదేశించడంతో పల్నాడు జిల్లా లింగంగుంట్ల ఎస్‌ఈ వెంకటరత్నం ఆమేరకు పెంచారు. సీఈ ఆదేశాల ప్రకారం జిల్లాకు సోమవారం 2,600 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆనీటిలో గుంటూరు బ్రాంచ్ కాలువకు 2,000 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్ కాలువకు 1,500 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా సరిహద్దు 85/3వ మైలు వద్దకు వచ్చేసరికి 2,600 క్యూసెక్కులు వస్తోంది. ఆ నీటిని పమిడిపాడు బ్రాంచ్ కాలువకు 655 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాలువకు 668 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. జిల్లాకు రెండురోజుల్లో 450 క్యూసెక్కుల నీరు పెంచడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు బ్రాంచ్ కాలువకు మరికొంత నీటి పరిమాణం పెంచాల్సి ఉంది. చివరి భూముల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున అన్ని మేజర్లకు నీరందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది. ఒంగోలు బ్రాంచ్ కాలువకు అన్ని మేజర్లు, మైనర్లకు నీరు సక్రమంగా అందించేందుకు 800 క్యూసెక్కుల నీరు సరఫరా చేయాల్సి ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటే అన్నిప్రాంతాలకు న్యాయం జరుగుతుంది.