అసంపూర్తిగా సచివాలయ భవనాలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:47 PM
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సచివాలయ వ్యవవస్థను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో సచివాలయ భవనాల నిర్మాణానికి స్థలాలు అందుబాటులో లేక కట్టడాలు ప్రాంభించలేదు. కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు ప్రాంభించి పూర్తి చేశారు. సచివాలయ కార్యకలాపాలు ఆ భవనాల్లోనే సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు అర్థాంతరంగా ఆగిపోయాయి.

వైసీపీ పాలనలో బిల్లులు చెల్లించక
నిర్మాణాలు పూర్తి చేయని కాంట్రాక్టర్‌లు
కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని
ప్రజల విజ్ఞప్తి
మేదరమెట్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సచివాలయ వ్యవవస్థను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో సచివాలయ భవనాల నిర్మాణానికి స్థలాలు అందుబాటులో లేక కట్టడాలు ప్రాంభించలేదు. కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు ప్రాంభించి పూర్తి చేశారు. సచివాలయ కార్యకలాపాలు ఆ భవనాల్లోనే సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. పునాదుల దశలో కొన్ని, 50, 60శాతం పనులు జరిగి అసంపూర్తిగా ఉన్నాయి. సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు కొంతమందికి వైసీపీ బిల్లులు కూడా చెల్లించలేదు. గ్రామాల్లో సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మంజూరు చేశారు. వీటిలో కొన్ని పూర్తయ్యాయి. కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి.
కొరిశపాడు మండలంలో మొత్తం 15 సచివాలయాలలో రెండు సచివాలయాల భవనాల నిర్మాణానికి నిధులు మం జూరు కాలేదు. మొత్తం 13 సచివాలయాల్లో 3 సచివాలయ భవానాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యాలయాలు నడుస్తున్నాయి. 50 శాతం పూర్తయిన సచివాలయాల్లో పమిడిపాడు-1, 2 దైవాలరావూరు, తమ్మవరం సచివాలయాలు ఉన్నాయి. రాచపూడి, మేదరమెట్ల-2, పి గుడిపాడు, కుర్రవానిపాలెం సచివాలయాలకు ఒక్కొక్క భవనానికి సుమారు రూ.5 లక్షలు నిధులు అందిస్తే పూర్తి అవుతాయి. వినియోగంలోకి కూడా వస్తాయి. తిమ్మనపాలెం సచివాలయం పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది. ఊరికి దూరంగా ఉందని గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు. రాచపూడిలో పాఠశాల ఆవరణలో సచివాలయం నిర్మించారని కోర్టులో కేసు వేశారు. పమిడిపాడు-1, 2 సచివాలయ భవన నిర్మాణ విషయంలో కోర్టుకు వెళ్లారు.
ఆరోగ్య కేంద్రాలు మండలంలో 9 మంజూరయ్యాయి. అందులో 3 అసలు పనులు ప్రారంభం కాలేదు. మూడు అసంపూర్తిగా ఉన్నాయి. 3 భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యాలయాలు పనిచేస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు 11 మంజూరయ్యాయి. అందులో 6 భవనాలు నిర్మాణం పూర్తయ్యాయి. 5 అసంపూర్తిగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. రూ.5 లక్షలలోపు నిధులతో పూర్తయ్యే భవనాలను వెంటనే పూర్తి చేయించాలని ఆయా స్థానికులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కోరుతున్నారు.