Share News

విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:15 PM

విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఎక్కడ పనిచేసినా ఆయన వక్రబుద్ధి మారడంలేదు. 2006లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన అతను ఇప్పటికే అసభ్యప్రవర్తనతో రెండుసార్లు, గృహ హింస కేసులో ఒకసారి సస్పెండ్‌ అయ్యారు.

విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన

ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన తల్లిదండ్రులు

విచారణ చేపట్టిన ఎంఈవో

కురిచేడు మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో ఘటన

కురిచేడు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఎక్కడ పనిచేసినా ఆయన వక్రబుద్ధి మారడంలేదు. 2006లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన అతను ఇప్పటికే అసభ్యప్రవర్తనతో రెండుసార్లు, గృహ హింస కేసులో ఒకసారి సస్పెండ్‌ అయ్యారు. వివరాల్లోకెళ్తే...

కురిచేడు మండలం కల్లూరు ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు పమిడిపూల సురేష్‌ అనే ఉపాధ్యాయుడు అద్దంకి మండలం మణికేశ్వరం నుంచి బదిలీపై వచ్చారు. ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులు మాత్రమే ఉండటంతో తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆ పాఠశాలను జనరల్‌ ప్రాథమిక పాఠశాలలో కలిపారు. ఉపాధ్యాయుడు సురేష్‌ ఈ ఏడాది విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. గురువారం అతని అసభ్య ప్రవర్తనను ఓ విద్యార్థిని తండ్రి గమనించాడు. అతడు తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఉపాధ్యాయడితో ఘర్షణ పడ్డాడు. హెచ్‌ఎం కలుగుజేసుకుని విద్యార్థిని తల్లిదండ్రులకు సర్దిచెప్పి బయటకు పంపారు. ఈవిషయం బయటకు పొక్కడంతో కల్లూరు క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయుడిని ఎంఈవో విచారణకు పంపారు. ఆయన విద్యార్థినులను విచారించగా, వాస్తవమేనని తేలింది. దీంతో ఎంఈవో వస్రాంనాయక్‌ ఆ ఉపాధ్యాయుడిని తన కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఎస్‌ఐ శివ సైతం సదరు ఉపాధ్యాయుడిని పోలీస్‌ స్టేషన్‌ను పిలిపించి విచారించారు.


మూడుసార్లు సస్పెండ్‌

ఉపాధ్యాయుడు సురేష్‌ ఇప్పటికీ మూడుసార్లు సస్పెండ్‌ అయ్యారు. చీరాల మండలం ఈపూరుపాలెం ఉర్దూ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనతో సస్పెండ్‌ అయ్యాడు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు ఉర్దూ ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే రీతిన సస్పెండ్‌ అయ్యాడు. అద్దంకి మండలం మణికేశ్వరంలో గృహ హింస కేసులో సస్పెండ్‌ అయ్యారు. అక్కడ నుంచి కురిచేడుకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా తన తీరు మార్చుకోకుండా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. ఈవిషయమై ఎంఈవోను వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిందని, విచారిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:15 PM