Share News

అగమ్యగోచరం

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:36 AM

సాగర్‌ ఆయకట్టు భూముల్లో సాగు చేసిన వరి పైరు కోతలు ముగిసి ధాన్యం రైతు ముంగిళ్లకు చేరుతున్నప్పటికీ కొనుగోళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ ఒక్క దానికి కూడా గోతాలు, కాటాలు ఇతర మెటీరియల్‌ చేరలేదు. దీంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.

అగమ్యగోచరం
త్రిపురసుందరీపురంలో ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి కాటాలు వేసిన ధాన్యం

ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించని అధికారులు

ధర తగ్గించి దోచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

దర్శి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ ఆయకట్టు భూముల్లో సాగు చేసిన వరి పైరు కోతలు ముగిసి ధాన్యం రైతు ముంగిళ్లకు చేరుతున్నప్పటికీ కొనుగోళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ ఒక్క దానికి కూడా గోతాలు, కాటాలు ఇతర మెటీరియల్‌ చేరలేదు. దీంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈదురు గాలులతో జల్లులు పడుతుండటంతో కళ్లాల్లో ధాన్యం తడుస్తుందనే భయంతో ప్రైవేటు వ్యాపారులు అడిగిన ధరలకు రైతులు అమ్ముకొంటున్నారు. సకాలంలో అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే అక్కడే అమ్ముకునే అవకాశం ఉండేది. ఇప్పటివరకు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు 75 కేజీల బస్తాను కేవలం రూ.1,400కు కొనుగోలు చేస్తున్నారు. అది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే సుమారు రూ.400 తక్కువ. దీంతోపాటు తేమ, తరుగు కింద బస్తాకు 4 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. ఆ విధంగా కూడా రైతులు మరో రూ.100 నష్టపోతున్నారు. మొత్తం మీద ధాన్యం బస్తాకు రూ.500 చొప్పున వచ్చే రాబడిని కోల్పోతున్నారు. ప్రభుత్వం గ్రేడ్‌-1 రకం 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకం 75 కేజీల బస్తాకు రూ.1,777 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆ ప్రకారం సేకరిస్తారు. సకాలంలో కేంద్రాలు ప్రారంభించి ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభించి ఉండేది. సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ఏటా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఈ ఏడాది కేంద్రాల పరిశీలన బాధ్యతను రెవెన్యూ అధికారులకు కూడా అప్పగించినప్పటికీ ఫలితం కన్పించడం లేదు. కొద్దిరోజుల క్రితం కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి దర్శిలో కేంద్రాల ఏర్పాటుకు రైస్‌ మిల్లులను పరిశీలించి వెళ్లారు. ఆసంద ర్భంగా కేంద్రాలు ప్రారంభించినట్లేనని, రైతులు ధాన్యం విక్రయించుకోవ చ్చని తెలిపారు. అయితే, ఇప్పటివరకు కేంద్రాలకు గోతాలు కూడా సరఫరా కాకపోవటంతో ఎక్కడా ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 02:36 AM