అగమ్యగోచరం
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:11 AM
మార్కాపురం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సహదిత్ వెంకట్ త్రివినాగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న బదిలీ చేసింది. ఆయన 23వతేదీ వరకు మార్కాపురంలో విధుల్లో ఉన్నారు. తర్వాత బదిలీ అయిన స్థానానికి వెళ్లిపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు వెలిగొండ ప్రాజెక్టు కంభం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు.
ఇన్‌చార్జిని నియమించారు.. డిజిటల్ సిగ్నేచర్ విస్మరించారు
సబ్ కలెక్టర్ బదిలీతో నిలిచిపోయిన బర్త్ సర్టిఫికెట్ల జారీ
అపార్ గడువు దగ్గరపడటంతో విద్యార్థులకు అవస్థలు
మార్కాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సహదిత్ వెంకట్ త్రివినాగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న బదిలీ చేసింది. ఆయన 23వతేదీ వరకు మార్కాపురంలో విధుల్లో ఉన్నారు. తర్వాత బదిలీ అయిన స్థానానికి వెళ్లిపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు వెలిగొండ ప్రాజెక్టు కంభం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. ఇన్‌చార్జిగా ఉన్న అధికారికి ఎఫ్‌ఏసీ ఇవ్వకపోవడంతో కొన్ని పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల ఫైళ్లు నెలరోజులుగా నిలిచిపోయాయి. తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఫైళ్లు వస్తున్నా ఇన్‌చార్జి సబ్ కలెక్టర్‌కు డిజిటల్ సిగ్నేచర్ లేకపోవడంతో ముందుకు కదలడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డును అపార్ వెబ్‌సైట్ ద్వారా అందజేస్తోంది. ఈ నెలాఖరు వరకే ఆ వెబ్‌సైట్‌కు గడువు ఉంది. ఆధార్ కార్డుల్లో తప్పుగా జన్మించిన తేదీ నమోదైన విద్యార్థులు సర్టిఫికెట్లు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అటు అధికారిని నియమించక, ఇటు ఎఫ్‌ఏసీ ఇవ్వకపోవడంతో బర్త్ సర్టిఫికెట్‌లే కాక పలు ధ్రువీకరణ పత్రాలు టేబుళ్లపై పేరుకుపోయాయి.
200 వరకు నిలిచిపోయిన బర్త్ సర్టిఫికెట్లు
మార్కాపురం డివిజన్‌లోని 13 మండలాల నుంచి రోజుకు కనీసం 5 నుంచి 10 వరకు బర్త్ సర్టిఫికెట్లు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వస్తుంటాయి. గతంలో ఆయా సర్టిఫికెట్లను దరఖాస్తుదారులకు అందేవిధంగా వెంటనే చర్యలు తీసుకునే వారు. బర్త్ సర్టిఫికెట్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి వస్తే ఒక్కరోజులోనే పని అయ్యేది. కానీ గతనెల 23 నుంచి నేటి వరకు సుమారు 200 వరకు సర్టిఫికెట్లు ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డికి డిజిటల్ సిగ్నేచర్ లేకపోవడంతో నిలిచిపోయాయి.
అపార్ గడువు దగ్గరపడటంతోనే సమస్య
ప్రస్తుతం కేంద్రప్రభుత్వం విద్యార్థులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించడం కోసం అపార్ అనే వెబ్‌సైట్ ద్వారా గుర్తింపు కార్డును ఇస్తోంది. దీన్ని పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ప్రస్తుతం సాధారణంగా పాఠశాలలో చేరే విద్యార్థుల డేట్ ఆఫ్ బర్త్‌ను రికార్డుల్లో నమోదు చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలలో నమోదు చేసే తేదీ కాకుండా ఆధార్ కార్డు పొందే సమయంలో పొరపాటున మరో తేదీ నమోదు చేయిస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు ప్రస్తుతం అపార్ ద్వారా కార్డు మంజూరు కావాలంటే సరైన ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో 18 సంవత్సరాలలోపు వారికి జన్మించిన తేదీని సరిచేయాలంటే తప్పకుండా బర్త్ సర్టిఫికెట్ కావాలి. పిల్లల బర్త్ సర్టిఫికెట్‌ల కోసం తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బర్త్ సర్టిఫికెట్లలో 90 శాతానికి పైగా విద్యార్థులవే. ఇన్‌చార్జి సబ్ కలెక్టర్‌కు ఎఫ్‌ఏసీ ఇస్తే డిజిటల్ సిగ్నేచర్ ద్వారా వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది.
వెంటనే ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌కు ఎఫ్‌ఏసీ ఇస్తాం
చిన్నఓబులేసు, జిల్లా రెవెన్యూ అధికారి, ఒంగోలు
గత నెలలో మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన అధికారి వచ్చేవరకు ఇన్‌చార్జిగా శివరామిరెడ్డిని కలెక్టర్ నియమించారు. ప్రభుత్వం నూతన అధికారిని నియమిస్తుందని చూశాం. ప్రజల సమస్యల దృష్ట్యా త్వరలోనే ఇన్‌చార్జి సబ్ కలెక్టర్‌కు ఎఫ్‌ఏసీ ఇస్తాం. డిజిటల్ సిగ్నేచర్ వస్తే విద్యార్థుల సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది.