పేదల సేవలో..
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:38 AM
జిల్లావ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ శనివారం పండుగ వాతావరణంలో సాగింది. ‘పేదల సేవలో ప్రభుత్వం’ పేరుతో ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు వాటిని పంపిణీ చేశారు.
ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ
చిలంకూరులో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి
పలుచోట్ల కీలక ప్రజాప్రతినిధులు హాజరు
ఒకరోజు ముందుగానే అందజేత
ఒంగోలు, మే 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ శనివారం పండుగ వాతావరణంలో సాగింది. ‘పేదల సేవలో ప్రభుత్వం’ పేరుతో ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు వాటిని పంపిణీ చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి తన సొంత నియో జకవర్గంలోని మర్రిపూడి మండలం చిలం కూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నగదు అంద జేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుక న్నారు. పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పది గంటలకే 75శాతం పూర్తి
జిల్లాలో మొత్తం 2,81,384 మంది పింఛన్ లబ్ధిదారులకు జూన్ నెలకు రూ.123.36 కోట్లు మంజూరయ్యాయి. ప్రతినెలా 1వతేదీన పంపిణీ చేస్తుండగా ఈసారి 1వతేదీ ఆదివారం వచ్చింది. దీంతో ఒకరోజు ముందుగానే శనివారం పంపిణీ చేశారు. అత్యధిక ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి ఫించన్ల పంపిణీ చేపట్టగా 10 గంటలకే దాదాపు 75శాతం మందికి అందజేశారు. అలా సాయంత్రం నాలుగు గంటల సమయానికి 88.50శాతం మంది లబ్ధిదారులకు సొమ్ములు అందాయి. రాత్రి వరకు కూడా అందుబాటులో ఉన్న వారికి పింఛన్లను అందజేశారు.
ఉత్సాహంగా పాల్గొన్న నేతలు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కీలక ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు గ్రామ, పట్టణ స్థాయి టీడీపీ నేతలు పింఛన్‌ల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి స్వామి కొండపి నియోజకవర్గంలోని చిలంకూరులో పాల్గొనగా ఆ నియోజకవర్గానికి చెందిన మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జరుగుమల్లిలో పింఛన్లు పంపిణీ చేశారు. ఒంగోలులోని 15వ డివిజన్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పింఛన్లు పంపిణీ చేయగా మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ సంతనూతలపాడులోని అంబేడ్కర్‌నగర్‌లో అందజేయగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని శాంతి క్లినిక్ ప్రాంతంలో పంపిణీ చేశారు. దోర్నాల మండలం ఐనముక్కలలో టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు పంపిణీ చేశారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలం శివరాంపురంలో అందజేశారు. దర్శి పట్టణంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది లబ్ధిని పంపిణీ చేయగా స్థానిక అధికారపార్టీ నాయకులు, అధికారులు భాగస్వాములయ్యారు.