పచ్చని పొలాల్లో.. నారుమళ్ల మధ్య
ABN , Publish Date - Aug 03 , 2025 | 02:22 AM
సీఎం చంద్రబాబు పర్యటన శనివారం జోరుగా హుషారుగా సాగింది. గతానికి భిన్నంగా దర్శిలో ప్రత్యేక స్టయిల్‌లో కొనసాగింది. పచ్చని పొలాల్లో మాగాణి కయ్యలు, నారుమళ్ల మధ్య రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
వినూత్నంగా రైతులతో సీఎం ముఖాముఖి
హుషారుగా చంద్రబాబు పర్యటన
దర్శి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటన శనివారం జోరుగా హుషారుగా సాగింది. గతానికి భిన్నంగా దర్శిలో ప్రత్యేక స్టయిల్‌లో కొనసాగింది. పచ్చని పొలాల్లో మాగాణి కయ్యలు, నారుమళ్ల మధ్య రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తొలుత 11.08 గంటలకు సీఎం హెలికాప్టర్ దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం పొలాల్లో ల్యాండ్ అయింది. 11.18 గంటల వరకు సుమారు పది నిమిషాలు అధికారులు, ప్రజాప్రతినిధులు సీఎంను కలిసి బొకేలు ఇచ్చారు.
మోదీ ప్రసంగం వీక్షణ
తూర్పువీరాయపాలెంలో రైతుల ముఖాముఖి సదస్సు వద్దకు సీఎం చంద్రబాబు 11.23 గంటలకు చేరారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీలలో ప్రధాని నరేంద్రమోదీ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల సందర్భంగా చేసిన ప్రసంగాన్ని సుమారు అర్ధగంట సేపు వీక్షించారు. 12.23 గంటలకు రైతులతో ముఖాముఖి ప్రారంభించారు. ఈసందర్భంగా ముండ్లమూరు మండలం శంఖరాపురం గ్రామానికి చెందిన అనూష అనే మహిళా రైతు, తూర్పువీరాయిపాలెం గ్రామానికి చెందిన యువరైతు అనిల్‌కుమార్, బొట్లపాలెం గ్రామానికి చెందిన అచ్చిరెడ్డిలకు మాట్లాడే అవకాశం కల్పించారు. అనంతరం రూ.46.85 కోట్ల అన్నదాత సుఖీభవ చెక్కును విడుదల చేశారు. 12.43 గంటలకు సీఎం ప్రసంగాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 1.20 గంటల వరకు మాట్లాడారు. సుమారు గంట సేపు సీఎం చంద్రబాబు రైతు సమస్యలపై, దేశ, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై అనర్గళంగా ప్రసంగించారు. ఆతర్వాత ప్రత్యేక బస్సులోకి వెళ్లారు. 2.05 గంటల వరకు వేదిక వద్దే బస్సులో నాయకులతో మాట్లాడుతూ గడిపారు. అక్కడ నుంచి 2.10 గంటలకు హెలిప్యాడ్ స్థలానికి చేరుకొని తిరిగి వెళ్లారు.
మండుటెండలో సైతం..
సీఎం చంద్రబాబు పర్యటనకు మండుటెండలో సైతం రైతులు, మహిళా రైతులు, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చారు. రైతుల సదస్సుకు తొలుత కేవలం పాస్‌లు ఉన్న మాత్రమే అనుమతిచ్చారు. సీఎం సభావేధిక వద్దకు వచ్చే సమయంలో రోడ్లపై ప్రజలు, మహిళలు బారులుతీరి స్వాగతం పలికారు. యువతీ యువకులు విక్టరీలు చూపుతూ కేరింతలు కొట్టారు. రెండేళ్ల చిన్నారులను సైతం తల్లిదండ్రులు సీఎం చంద్రబాబును చూపించాలనే ఉద్దేశంతో అక్కడకు తెచ్చి భుజాలపై ఎక్కించుకొని చూపించారు. ప్రజల చూపిన ఉత్సాహన్ని చూసి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రజలకు అభివాదం చేస్తూ కొన్ని సందర్భాల్లో విక్టరీ చూపుతూ సుమారు మూడు కిలోమీటర్ల దూరం హెలిప్యాడ్ నుంచి రైతులతో ముఖాముఖి సదస్సు వద్దకు చేరుకున్నారు. ఒక వైపు సజ్జ చేను, మరోవైపు దమ్ము చేసిన మాగాణి, ఇంకోవైపు వరినాట్లు వేస్తున్న మాగాణి మధ్యలో రైతుల ముఖాముఖి సదస్సు ప్రత్యేక స్టయిల్‌లో సాగింది. కార్యక్రమం జరుగుతున్నంత సేపు మండుటెండను సైతం లెక్కచేయక మహిళలు, చిన్నారులు ఎంతో శ్రద్ధగా సీఎం ప్రసంగాన్ని విన్నారు. యువత అనేక సందర్భాల్లో విక్టరీ చూపుతూ కేరింతలు కొట్టారు. చంద్రబాబు పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో నాయకులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.