ఆర్థిక ఒడిదొడుకుల్లోనూ హామీల అమలు
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:21 PM
ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలుచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి ప్రాంగణంలో ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
నియోజకవర్గంలో 1136 మంది ఆటోడ్రైవర్లకు లబ్ధి
కనిగిరి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలుచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి ప్రాంగణంలో ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ముందుగా సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో 1136మందికి రూ1,70,40,000 నగదు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమైనట్లు చెప్పారు. ప్రతి ఆటోడ్రైవర్ ఖాతలో నేరుగా రూ.15 వేలు నగదు జమ చేసి ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. ఇది ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిన మరోహామీ అని చెప్పారు. ఇది ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను తెలిపే నిదర్శనంగా భావించాలన్నారు. ప్రభుత్వం అందించిన ఈసహాయాన్ని ప్రతి ఆటోడ్రైవర్ తమ కుటుంబ అబివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆటోడ్రైవర్లకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ కావటంతో వారి ఆనందానికి అవదులు దాటాయి. పెద్దఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఆటోలకు జెండాలు కట్టి సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహరెడ్డి ఆటోడ్రైవింగ్ చేసుకుంటూ ఆటోడ్రైవర్లతో కలసి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సన్నివేశం ఆటోడ్రైవర్లలో మరింత జోష్ నిం పింది. ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరిగా వచ్చి ఎమ్మెల్యేకు కరచాలన చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం
దర్శి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటో డైవర్లకు అన్నివిధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రూ.15వేలు చొప్పున శనివారం వారి అకౌంట్‌లలో వేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా స్థానిక ఆర్టీవో కా ర్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ఆటో ర్యాలీ నిర్వహిం చారు. డాక్టర్ లక్ష్మి స్వయంగా ఆటో నడిపారు. అనంతరం కాలేజీలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలుచేస్తుందని చెప్పారు. సూపర్‌సిక్స్ పథకాలను సూపర్ సక్సెస్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హమీని నెరవేర్చినట్టు చెప్పారు. దర్శి నియోజకవర్గంలో 1089 మంది డ్రైవర్లకు రూ.1,63,35000 నగదు జమ చేసినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసిందన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో పి. కల్పన, మున్సిపల్ కమిషనర్ వై.మహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.