Share News

ఎరువుల అక్రమ నిల్వలు సీజ్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:52 PM

పొదిలిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడులు చేశారు. అనుమతి లేకుండా ఓ గోడౌన్‌లో నిల్వ చేసిన 20 రకాలకు చెందిన 1,704 ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుంటున్నారు

ఎరువుల అక్రమ నిల్వలు సీజ్‌
అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను స్వాధీనం చేసుకున్న అధికారులు

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు

రూ.20.43లక్షల విలువైన 1,704 బస్తాలు స్వాధీనం

షాప్‌ యజమానిపై 6ఏతోపాటు క్రిమినల్‌ కేసు

పొదిలి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : పొదిలిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడులు చేశారు. అనుమతి లేకుండా ఓ గోడౌన్‌లో నిల్వ చేసిన 20 రకాలకు చెందిన 1,704 ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వీటి విలువ సుమారు రూ.20.43 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. విజిలెన్స్‌ సీఐ రవిబాబు కథనం మేరకు.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న 4 ఎరువుల దుకాణాలో సోదాలు నిర్వహించారు. శ్రీలక్ష్మీట్రేడర్‌ ్స దుకాణం తాళం వేసి ఉండడంతో అధికారులు యజమానికి ఫోన్‌ చేసినప్పటికీ స్పందించ లేదు. దీంతో తహసీల్దార్‌, ఎస్‌ఐల సమక్షంలో తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న దుకాణ యజమాని గుమస్తాను పంపించి తాళాలను తీయించారు. అక్కడ నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆ దుకాణానికి సంబంధించి వెంకయ్య స్వామి గుడి ఎదురుగా ఉన్న అనుమతిలేని గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ రికార్డులో నమోదు చేసిన దానికి, గోడౌన్‌లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. సుమారు 20 రకాలకు చెందిన 1,704 ఎరువుల బస్తాలను అనుమతి లేకుండా అక్కడ నిల్వ ఉంచినట్లు నిర్ధారణకు వచ్చారు. వాటిని సీజ్‌ చేశారు. దుకాణ యజమాని రాజశేఖరరెడ్డిపై 6ఏ, క్రిమినల్‌ కేసు నమోదు చేయనున్నట్లు సీఐ రవిబాబు తెలిపారు. ప్రభుత్వం ఎరువుల కొరత లేదని ఇప్పటికే ప్రకటించిందని, దుకాణదారులు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తహసీల్దార్‌ పాల్‌, ఎస్సై నాగేశ్వరరావు, కానిస్టేబుల్‌ కృష్ణ, సురేష్‌, వ్యవసాయాధికారి డి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో ఇదే దుకాణంలో పెద్దఎత్తున అక్రమ నిల్వలు దాచిపెట్టగా అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడితో దాడి చేసేందుకు వచ్చిన అధికారులు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది.


ముండ్లమూరు మండలంలో 270 బస్తాల ఎరువులు స్వాధీనం

ముండ్లమూరు మండలం పసుపుగల్లులోని శ్రీనాగార్జున ఫెర్టిలైజర్‌ ఎరువుల దుకాణం, చింతలపూడిలోని శ్రీమల్లికార్జున ట్రేడర్స్‌పై సోమవారం సాయంత్రం ఏకకాలంలో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1.56లక్షల విలువైన 270 బస్తాల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్‌ చేశారు.

కొనకనమిట్లలో..

కొనకనమిట్ల : మండలంలోని పెదారికట్ల గ్రామంలో పురుగుమందులు, ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి ప్రకా్‌షరావు సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుగు మందులు, ఎరువుల షాపులవారు బిల్లులు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని సూచించారు. షాపులైసెన్స్‌ డాక్యుమెంట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోఎస్‌ రవికాంత్‌, విక్రమ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:53 PM