Share News

ఖాళీ స్థం కనిపిస్తే కబ్జా!

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:04 AM

దర్శి పట్టణంలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. వాటిలో దర్జాగా పక్కా కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. అయినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆక్రమణదారుల నుంచి భారీ మొత్తాలు ముట్టడంతో మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఖాళీ స్థం కనిపిస్తే కబ్జా!
దర్శిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన గోడౌన్‌, మరికొంత భూమిలో ప్రహరీ

దర్శిలో రెచ్చిపోతున్న ఆక్రమణదారులు

ఇప్పటికే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు సొంతం

దర్జాగా నిర్మాణాలు

తాజాగా మరికొన్నింటిలో పాగా

పట్టించుకోని అధికారులు

దర్శి, ఆగస్టు 18 (ఆంద్రజ్యోతి) : దర్శి పట్టణంలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. వాటిలో దర్జాగా పక్కా కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. అయినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆక్రమణదారుల నుంచి భారీ మొత్తాలు ముట్టడంతో మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డుకు సమీపంలోని బండిదారి స్థలంలో యథేచ్ఛగా గృహాలు నిర్మించారు. కొంతమంది గోడౌన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మరికొందరు కూడా ఆక్రమించి ప్రహరీలు ఏర్పాటు చేస్తున్నారు. దర్శి-కురిచేడు రోడ్డుకు ఉత్తరం వైపున యర్రచెరువు ఉంది. ఆ చెరువుకు, రోడ్డుకు మధ్యలో సుమారు ఎకరాకుపైగా ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ సెంటు స్థలం రూ.25 లక్షలు పలుకుతుంది. అక్రమార్కులు యర్రచెరువు స్థలంలో కొంతభాగాన్ని, ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్‌ స్థలంలో కొంతభాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. కొంతమంది రేకుల షెడ్లు వేసి కొంతకాలం తర్వాత శాశ్వత భవనాలు నిర్మించుకొని సొంతం చేసుకుంటున్నారు. అలాగే, దర్శి-పొదిలి రోడ్డులో కాటేరు వాగును ఆక్రమించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. దర్శి-అద్దంకి రోడ్డులో ప్రభుత్వ స్థలంలో కొంతభాగాన్ని ఆక్రమించి భవనాలు నిర్మించారు. మరికొంత భాగాన్ని ఆక్రమించేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

సహకరిస్తున్న అధికారులు

ప్రభుత్వ స్థలాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆదిశగా తీసుకుంటున్న చర్యలు మృగ్యమయ్యాయి. దీంతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారు ఆ తర్వాత నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని తొలగించాల్సిన అధికారులు పెనాల్టీల పేరుతో పన్నులు వేసి క్రమబద్ధీకరణకు సహకరిస్తున్నారు. గతంలో ఎంతోమంది ఇదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేసి కొన్ని సంవత్సరాలు పన్నులు కట్టి ఆతర్వాత క్రమబద్ధీకరించాలని కోర్టులకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇలా ఇప్పటికే కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు సొంతం చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈతంతు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 01:04 AM