అభివృద్ధి కనిపించకుంటే కళ్లద్దాలు పెట్టుకోండి
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:51 PM
వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పదేపదే ఇంటర్వ్యూలు ఇస్తూ నియోజకవర్గంలో ఏమి జరగటం లేదని అబద్ధాలు చెబుతున్నారని, జరిగిన, జరుగుతున్న పనులు కన్పించకపోతే కళ్లకు మంచి పవర్ ఉన్న అద్దాలు పెట్టుకోవాలని టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలో ఏమీ జరగడం లేదని పదేపదే ఇంటర్వ్యూలా..
ఎమ్మెల్యే తాటిపర్తిపై టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఫైర్
కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు
అంతర్గత, లింక్, బీటి రోడ్ల రూపురేఖలు మార్చాం.. మారుస్తున్నాం
ఎర్రగొండపాలెంలో అన్నా క్యాంటిన్ పరిశీలన
ఎర్రగొండపాలెం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పదేపదే ఇంటర్వ్యూలు ఇస్తూ నియోజకవర్గంలో ఏమి జరగటం లేదని అబద్ధాలు చెబుతున్నారని, జరిగిన, జరుగుతున్న పనులు కన్పించకపోతే కళ్లకు మంచి పవర్ ఉన్న అద్దాలు పెట్టుకోవాలని టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఎద్దేవా చేశారు. ఎర్రగొండపాలెంలో అన్నా క్యాంటిన్ వచ్చే నెల 1వ తేదీ ప్రారంభించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. క్యాంటిన్ భవనాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో గత 18 నెలల్లోనే కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. రూ.10 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. సాస్కి నిధులతో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి నుంచి గ్రామాలకు అనుసంధానమైన 3 బీటీ రోడ్లకు రూ.10.64 కోట్లు మంజూరయ్యాయన్నారు. డీఎంఎఫ్ నిధులతో పెద్దారవీడు కేజీబీవీ పాఠశాల రోడ్డుకు రూ.50లక్షలు, బోడిరెడ్డిపల్లి జడ్పీ పాఠశాల రోడ్డుకు రూ.25 లక్షలు, బీ చెర్లోపల్లిలో రోడ్డుకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. రూ.5 కోట్లతో సీసీ రోడ్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. పాలుట్ల గిరిజన గూడెంలో అన్ని గృహాలకు సోలార్ కనెక్షన్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశారన్నారు. ఎర్రగొండపాలెంలో రూ.6 కోట్లతో బాలికల వసతి గృహం నిర్మాణంలో ఉందని, ఎర్రగొండపాలెం-త్రిపురాంతకం ఆర్‌్క్షబీ రోడ్డు రూ.7 కోట్లతో నిధులతో నిర్మాణంలో ఉందని వివరించారు. ఎన్నోఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న దోర్నాల బస్టాండుకు అవసరమైన రెండు రోజుల క్రితమే జిల్లా కలెక్టరు నుంచి ప్రొసిడింగ్స్ ఇప్పించినట్లు తెలిపారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద బ్రిడ్జికి రూ.3కోట్లు మంజూరు చేయిస్తున్నట్లు వివరించారు. ఎర్రగొండపాలెంలో రోడ్డువేశారే తప్ప డివైడర్‌పై సెంట్రల్ లైటింగ్ లేదని, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఇంకా పలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, ముఖ్యనాయకులు వేగినాటి శ్రీను, శనగా నారాయణరెడ్డి, కంచర్ల సత్యనారాయణగౌడ్, తోట మహెష్, బీవీ సుబ్బారెడ్డి, జనసేన నాయకులు పాల్గొన్నారు.