నిర్లక్ష్యంగా ఉంటే వేటు తప్పదు
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:20 AM
‘విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు. ఏ పని చేయకుండా ఉండేం దుకు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుందా? క్షేత్రస్థాయిలో పట్టించు కోకుండా ఇక్కడకు వచ్చి కాకమ్మ కథలు వినడం కోసం పిలిపిం చామా?’ అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మండిపడ్డారు.
పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ మండిపాటు
సమావేశానికి గైర్హాజరైన పెద్దారవీడు ఈవోపీఆర్‌డీకి షోకాజ్ నోటీసు
ఎర్రగొండపాలెం ఎంపీడీవోకూ జారీ చేయాలని జడ్పీ సీఈవోకు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ‘విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు. ఏ పని చేయకుండా ఉండేం దుకు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుందా? క్షేత్రస్థాయిలో పట్టించు కోకుండా ఇక్కడకు వచ్చి కాకమ్మ కథలు వినడం కోసం పిలిపిం చామా?’ అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మండిపడ్డారు. కలెక్టరే ట్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీ లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పారిశుధ్యంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశానికి పెద్దారవీడు ఈవోపీఆర్‌డీ హాజరుకాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉంటే ఎందుకు రాలేదని డీపీవో జి.వెంకటనాయుడును కలెక్టర్ ప్రశ్నించగా తనకు కూడా ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు. వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైపాలెం ఈవోపీఆర్‌డీ కూడా రాకపోవడంపై కలెక్టర్ ప్రశ్నించగా స్థానికంగా వేరే కార్యక్రమం ఉన్నందున తాను అనుమతి ఇచ్చానని వైపాలెం ఎంపీడీవో ఆమె దృష్టికి తేవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం తన దృష్టికి తీసుకురాకుండా ఈవోపీఆర్‌డీకి ఎలా అనుమతి ఇస్తారని ఎంపీడీవోపై మండిపడ్డారు. వైపాలెం ఎంపీడీవోకు షోకాజ్ నోటీసు జారీచేయాలని జడ్పీ సీఈవో చిరంజీవిని ఆదేశించారు.
కథలు ఎందుకు చెబుతున్నారు
చెత్త తరలించేందుకు రిక్షాల సమస్య ఉందని, నెలకు రూ.6వేలు జీతానికి క్లాప్ మిత్రులు పనిచేయడం లేదని సమావేశంలో ఈవోపీఆర్‌డీలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రిక్షాల సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారా? లేకపోతే ఉన్నతాధికారులతో మాట్లాడారా? అని ప్రశించారు. వాటిపై అలోచించకుండా ఇక్కడకు వచ్చి, రకరకాల కథలు ఎందుకు చెప్తున్నారని మండిపడ్డారు. మీ మాటలు వినేందుకే ఇక్కడకు పిలిపించామా అని సూటిగా ప్రశ్నించారు. క్లాప్‌మిత్రలకు ఇచ్చే వేతనాలను స్థానిక వనరుల నుంచే సమకూర్చుకోవడంపై దృష్టిసారించాలని ఆదేశించారు. తమ పరిధిలోని సమస్యలపై ఎంపీడీవోలు దృష్టిపెట్టాలన్నారు. సమావేశ అజెండా ముందుగానే చెప్పినా సరిగా సన్నద్ధం కాకుండా మొక్కుబడి సమాధానాలు చెప్పేందుకు వచ్చారా? అని ప్రశ్నించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన ఇండికేటర్స్‌లో జిల్లా స్థానం పేలవంగా ఉంటే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వచ్చే శుక్రవారం నాటికి ఆయా ఇండికేటర్స్‌లో గణనీయమైన పురోగతి సాధించాలన్నారు. సమవేశంలో జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు పాల్గొన్నారు.