Share News

మళ్లీ తుఫాన్‌ వస్తే భారీ నష్టం!

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:33 PM

వారం రోజులలో మరో తుఫాన్‌ వస్తుందన్న సమాచారంతో మండలంలోని రాజుగారిపాలెం వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్‌ కారణంగా మండలంలోని రాజుగారిపాలెంలో నష్టం జరిగింది.

మళ్లీ తుఫాన్‌ వస్తే భారీ నష్టం!
వరదనీటి ఉధృతికి ఎస్సీ కాలనీ సమీపంలో కట్టకు కోతపడిన ప్రదేశం

భారీ వర్షాలకు రాజుగారిపాలెంలో కోతకు గురైన వరద కట్ట

నేటికీ ఆ నష్టాలను పరిశీలించని అధికారులు

మార్టూరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : వారం రోజులలో మరో తుఫాన్‌ వస్తుందన్న సమాచారంతో మండలంలోని రాజుగారిపాలెం వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్‌ కారణంగా మండలంలోని రాజుగారిపాలెంలో నష్టం జరిగింది. వరదనీరు ఉధృతికి వరదకట్ట తెగిపోయింది. ఆ సమయంలో ఎస్సీ కాలనీలోకి వరదనీరు వస్తుందని భయంతో కాలనీ వాసులు వణికిపోయారు. అనూహ్యంగా వరదనీరు తగ్గడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు భారీ వర్షాలకు మార్టూరు నుంచి రాజుగారిపాలేనికి వెళ్లే రోడ్డులో తూముల చప్టాపై ఐదు అడుగులపైనే వరదనీరు పారింది. ఈ కారణంతో వాగు ఎగువన ఉన్న చెక్‌ డ్యాం గోడపడిపోయింది. అంతేగాకుండా చెక్‌ డ్యాంకు, సమీపంలోని పొలంగట్టుకు మధ్య సుమారు 20 అడుగుల వరకు మట్టి కోతకు గురయ్యింది. చెక్‌ డ్యాం కొంతమేర కుంగిపోయింది. ఇంకా రాజుగారిపాలెం నుంచి జొన్నతాళి వెళ్లే తారురోడ్డు కోతకు గురయ్యింది. అన్నింటికన్న ముఖ్యమైన విషయం వరదనీరు కారణంగా గ్రామం చుట్టూ ఏర్పాటు చేసిన వరద కట్టకు సుమారు 50 అడుగులు మేర కోతకు గురయ్యింది. మరో 24 గంటలు వరదనీటి ప్రవాహం కొనసాగినట్లయతే, వరదకట్ట తెగిపోయి ఎస్సీ కాలనీ ముంపుబారినపడేది.

నాడు సీఎం చంద్రబాబు గ్రామ రక్షణకు రూ.25 లక్షలు మంజూరు

వాస్తవంగా 1998లో ప్రస్తుత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజుగారిపాలెంలో పర్యటించారు. ఆ సమయంలో గ్రామానికి వాగు పొంగి వరదనీరు తరచూ చుట్టుముడుతున్నదని సర్పంచ్‌ ఉప్పలపాటి తిరుపతిరాజు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చంద్రబాబు గ్రామం చుట్టూ వరద కట్ట నిర్మాణానికి 25 లక్షలు రూపాయలు మంజూరుచేయగా వరదకట్ట నిర్మాణం జరిగింది. మొంథా తుఫాన్‌ సమయంలో ఈ వరదకట్టకు 50 అడుగులు మేర కోత పడింది. ఇంతవరకు రాజుగారిపాలెంలో జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలించలేదు.

మరో వారం రోజులలో మరో తుఫాన్‌ రానున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 14 , 2025 | 11:33 PM