నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించను!
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:21 AM
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సోమవారం కనిగిరిలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కలెక్టర్ రాజాబాబు హెచ్చరిక
సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు తహసీల్దార్లపై ఆగ్రహం
కనిగిరిలో ‘మీ కోసం’కు పోటెత్తిన అర్జీదారులు
కనిగిరి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సోమవారం కనిగిరిలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా సీఎస్‌పురం, హనుమంతునిపాడు తహసీల్దార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌పురం మండలం అంబవరం కొత్త పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 80లో 504 ఎకరాల ప్రభుత్వ భూమిలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని అదే మండలానికి చెందిన నాగూర్‌వలి ఫిర్యాదు చేశారు. పలుమార్లు అర్జీ ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. 1975-76 ప్రాంతంలో ఇచ్చిన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కలెక్టర్‌కు విన్నవించారు. ఇదే సర్వే నంబరులోని ప్రభుత్వ భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైందని, దీని వెనుక గత తహసీల్దార్ నాగూర్‌వలి ఉన్నారని ఆరోపించారు. ఈవిషయంపై ప్రస్తుత తహసీల్దార్‌కు మొరపెట్టుకున్నా కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ వారిరువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అర్జీపై నిర్ణీత కాలంలో పరిష్కరించకపోతే విధులు నుంచి తొలగిస్తానని హెచ్చరించారు.
సర్వే నంబర్ 432లో జరిగిన రిజిస్ర్టేషన్‌లను రద్దు చేయాలని ఫిర్యాదు
కనిగిరి పట్టణంలోని కందుకూరు రోడ్డులో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 432లో అక్ర మంగా రిజిస్ర్టేషన్‌లు జరిగాయని తాతపూడి శ్యామ్, తిరుపతిరావు ఫిర్యాదు చేశారు. 1975లో ఇచ్చిన పట్టాల స్థానంలోని భూమిలో కొంత మంది అక్రమార్కులు 433 సర్వే నంబరు, డోర్ నంబర్‌లతో అక్రమంగా రిజిస్ర్టేషన్‌లు చేయించారని ఫిర్యాదు చేశారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. అప్పట్లో డీకే పట్టా మంజూరు చేసిన వారి పేరుతో కాకుండా మరో వ్యక్తుల పేరుతో సదరు భూమిని కొన్నట్లుగా రిజిస్ర్టేషన్ చేపట్టారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తప్పుడు రిజిస్ర్టేషన్‌లు రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. 432 సర్వే నంబరులో అక్రమ రిజిస్ర్టేషన్‌లకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారిపై చర్యలు తీసకోవాలని సదరు శాఖలను ఆదేశిస్తామని కలెక్టర్ చెప్పారు. 432సర్వే నంబరులో రిజిస్ర్టేషన్ పేరుతో చేపట్టే అక్రమ కట్టడాలను నిలిపివేయాలంటూ మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.
అనాథ పిల్లలను ఆదుకోవాలి
తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోవాలని కలెక్టర్ రాజాబాబుకు సీఎస్‌పురం మండలానికి చెందిన ఇర్లా నీలమ్మ అనే మహిళ వేడుకుంది. సీఎస్‌పురం మండలం వడ్డెపాలెంకు చెందిన మోక్షిత, గౌతంకృష్ణల చిన్నప్పుడే తల్లి మతిస్థిమితం లేక ఎటో వెళ్ళిపోయిందని, తండ్రి ఇటీవల బేల్దారి పనిచేస్తూ బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందాడని పేర్కొన్నారు. చిన్నారులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మేనత్తనని సంరక్షకురాలిగా ధ్రువీకరణ పత్రం ఉంటే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అర్హులు కాగలరని చెప్పారు. ఈవిషయమై ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కుదరదంటూ పంపించేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కలెక్టర్ వెంటనే సంబందిత శిశుసంరక్షణశాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను పిలిపించి వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
దివ్యాంగుల హాస్టల్‌లో అవినీతిపై ఫిర్యాదు
జిల్లా దివ్యాంగుల సంక్షేమ హాస్టల్‌లో సీనియర్ అసిస్టెంట్ గ్రంది రవితేజ అక్రమాలు, అవినీతిని వెలికితీయాలని పొదిలి ప్రాంతానికి చెందిన నవ్యాంధ్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు ముల్లా మదార్‌వలి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అక్రమాలు, అవినీతి వివరాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.