ప్రజాసమస్యలపై ప్రతి వార్డులో పర్యటిస్తా!
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:14 PM
ప్రజాసమస్యలపై ప్రతి వార్డులో పర్యటిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. శనివారం కనిగిరి పట్టణంలోని 1, 2 వార్డుల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి(వెలిగండ్ల), జూన్ 7(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలపై ప్రతి వార్డులో పర్యటిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. శనివారం కనిగిరి పట్టణంలోని 1, 2 వార్డుల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు. ఈసందర్భంగా బీసీ కాలనీ వాసులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. నెలకోసారి కూడా మురుగు కాల్వలు శుభ్రం చేయడంలేదని, రాత్రి పూట దోమల ఉధృతికి జాగారం చేస్తున్నామన్నారు. బ్రతిమలాడిన పారిశుధ్య సిబ్బంది ఇటు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులకోసారి కూడా నీటి ట్యాంకర్లు రావడం లేదన్నారు. పలుకుబడి కల్గినవారికి మాత్రమే నీటి ట్యాకర్లు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మాలాంటి నిరుపేద కుటుంబాలకు నీళ్లు సరఫరా చేయడం లేదన్నారు. వీధుల వెంబడి చిల్ల చెట్లతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.. మట్టి రోడ్ల స్థానంలో సీసీరోడ్లు నిర్మించాలని కోరారు. ఎక్కడచూసిన చెత్త పేరుకుపోయి ఉందన్నారు. ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ వార్డులో పర్యటించి ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తానన్నారు. పారిశుధ్య పనులు చేయిస్తానని చెప్పారు. రెండు రోజులకోసారి నీటి ట్యాంకర్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, శానటరీ ఇన్‌స్పెక్టర్ నాయబ్ రసూల్‌ను ఆదేశించారు. లేకుంటే మీపై చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో తమ్మినేని శ్రీను, ముకుంద, నారాయణమ్మ, తులసి, దొరసాని, వెంకటరెడ్డి, జానీ, రాచర్ల నారయణ, ఈదర్ల రవి పాల్గొన్నారు.