భార్యను హత్య చేసిన భర్త
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:03 AM
భార్యపై అనుమానంతో నమ్మించి పొలం తీసుకెళ్లి భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బేస్తవారపేట మండలంలోని పచ్చర్ల వెంకటాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బంధువులకు సమాచారం ఇచ్చి పారిపోయిన వైనం
కేసు నమోదు చేసిన పోలీసులు
బేస్తవారపేట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : భార్యపై అనుమానంతో నమ్మించి పొలం తీసుకెళ్లి భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బేస్తవారపేట మండలంలోని పచ్చర్ల వెంకటాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పచ్చర్ల వెంకటాపురం గ్రామానికి చెందిన పగ్గాల తిరుపతమ్మ(50) భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తిరుపతమ్మపై అనుమానం పెంచుకున్న భర్త వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం మోటార్ బైక్‌పై ఎక్కించుకొని మొక్కజొన్నకు నీరు పెట్టాలని పొలం తీసుకెళ్లాడు. అక్కడ దాచి ఉంచిన మొద్దు కత్తితో తిరుపతమ్మ మెడను అతి దారుణంగా నరికి హత్య చేసి పరారయ్యాడు. సాయంత్రం వారి సమీప బంధువులకు వెంకటేశ్వర్లు ఫోన్ చేసి తన భార్యను చంపానని, మృతదేహం మొక్కజొన్న తోట వద్ద ఉందని సమాచారం ఇచ్చాడు. వెంటనే వారి బంధువులు పోలీసులకు తెలిపారు. దీంతో శుక్రవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.