టీ తాగివస్తానని చెప్పి భర్త పరార్
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:30 PM
టీతాగి వస్తానని తెలంగాణ రాష్ట్రం ఆర్మూర్ బస్టాండ్‌లో వదిలేసి పత్తాలేకుండా పోయాడు భర్త. అతని జాడ కోసం తెలంగాణాకు చెందిన ఓ వివాహిత బుధవారం పొదిలి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ వివాహిత
తెలంగాణలో ఘటన
పొదిలి పంచాయతీలోని పోతవరం గ్రామానికి చెందిన యువకుడి మోసం
పొదిలి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : టీతాగి వస్తానని తెలంగాణ రాష్ట్రం ఆర్మూర్ బస్టాండ్‌లో వదిలేసి పత్తాలేకుండా పోయాడు భర్త. అతని జాడ కోసం తెలంగాణాకు చెందిన ఓ వివాహిత బుధవారం పొదిలి పోలీసులను ఆశ్రయించింది. పొదిలి నగరపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన బత్తుల కార్తీక్ బేల్దారి పనుల నిమిత్తం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. అక్కడ అనూషతో పరిచయం ఏర్పడింది. ప్రేమించుకొన్నారు. కుటుంబపెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కూలినాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చింది. ఇటీవల కార్తీక్ తమసమీప బంధువు వేడుకల్లో పాల్గొనేందుకు భార్యతో సహా దర్శి వచ్చారు. అతని కుటుంబ సభ్యులు ఏదో విధంగా అనూషను వదిలించుకొని వస్తే మరో వివాహం జరిపిస్తామని గట్టిగా పట్టుబట్టారు. దీంతో తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన కార్తీక్ భార్యతోసహా తిరిగి తెలంగాణా రాష్ట్రానికి పయనమై వెళ్లారు. ఆర్మూర్ బస్టాండ్‌లో టీతాగి వస్తానని చెప్పి భార్యను వదిలేసి పత్తాలేకుండా పోయాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె తిరిగి అత్తగారి ఊరైన పోతవరం చేరుకుంది. ఇంటికిరాగానే తాళం వేసి ఉండటంతో అవాక్కైన ఆమె అత్తామామలకు ఫోన్ చేసింది. రూ.10లక్షలు తేవాలని వారు ఖరాఖండీగా తేల్చి చెప్పడంతో ఏమిపాలుపోని అనూష బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ వేమన తెలిపారు.