Share News

చికెన్‌ కూర వండలేదని భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:56 PM

నచ్చిన కూర భార్య వండలేదని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో చోటుచేసుకుంది.

చికెన్‌ కూర వండలేదని భర్త ఆత్మహత్య

ఎర్రగొండపాలెం రూరల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నచ్చిన కూర భార్య వండలేదని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇళ్ల లక్ష్మీనారాయణ (25) భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం చికెన్‌ కూర వండాలని చెప్పడంతో భార్య వినకపోవడంతో మనస్తాపానికి గురై పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. లక్ష్మీనారాయణ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక ఆత్మహత్య

బావి నుంచి నీరు తెచ్చే విషయమై ఘర్షణ

ఎర్రగొండపాలెం రూరల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : అక్కా, తమ్ముడు మధ్య ఏర్పడిన గొడవతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగి ఆత్మాహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మండలంలోని పాలుట్ల గూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన బాలునాయక్‌, మంగిబాయికి ఆరుగురు సంతానం. వారిలో మూడో అమ్మాయి, చివరి అబ్బాయి(తమ్ముడు) మధ్య బావి నుంచి నీరు తీసుకొచ్చే విషయమై ఘర్షణ నెలకొంది. దీంతో అరుణబాయి (16) పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మాహత్య చేసుకుంది. సమీపంలో ఉన్న తల్లి, కుటుంబ సభ్యులు గమనించి ఎర్రగొండపాలెం ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. తల్లి మంగిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చౌడయ్య కేసు నమోదు చేశారు.

టిప్పర్‌ కింద పడి వ్యక్తి మృతి

కొనకనమిట్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గొట్లగట్టు గ్రామంలో టిప్పర్‌ కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదిలి వైపు నుంచి కంభం వైపు వెళ్తున్న టిప్పర్‌ గొట్లగట్టు గ్రామం వద్దకు వచ్చేసరికి.. ఇంటి నుంచి బయలుదేరిన పొదిలి శ్రీనివాసులు(30) బైకుకు తగిలింది. దీంతో అతను కింద పడగా తలపై నుంచి టిప్పర్‌ వెళ్లడంతో మృతిచెందాడు. ఎస్‌ఐ వేమన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ద్విచక్రవాహనం అదుపు తప్పి మహిళ మృతి

పొన్నలూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వెంకుపాలెం సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో షేక్‌ ఖాశింబి(53) మృతి చెందింది. కనిగిరిలోని టకారిపాలేనికి చెందిన ఖాశింబి తన కుమారుడు నాయబ్‌ రసూల్‌తో కలిసి ఓ ఫంక్షన్‌ కోసం కందుకూరు మోటార్‌ సైకిల్‌పై బయలుదేరారు. వెంకుపాలెం సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడగా, ఖాశింబికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రసూల్‌ను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 11:56 PM