Share News

జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:44 PM

వస్తు సేవా పన్ను తగ్గింపుతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతాయని బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మండలంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలసి బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు.

జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రానికి   భారీ పెట్టుబడులు
నూతలపాడలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవ శిలాఫలకాన్నిఆవిష్కరిస్తున్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ఏలూరి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి

నూతలపాడులో ఎమ్మెల్యే ఏలూరితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

పర్చూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : వస్తు సేవా పన్ను తగ్గింపుతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతాయని బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మండలంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలసి బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నూతలపాడులో రూ.1.80 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వారు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 70 డ్వాక్రా గ్రూపు పొదుపు సంఘాలకు రూ.2.50 కోట్ల బ్యాంక్‌ రుణాల చెక్కులను అందజేశారు. అదేవిధంగా 20 మంది విభిన్న ప్రతిభావంతులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. మరో ఐదుగురికి రూ.2.50 లక్షల విలువ చేసే ట్రైసైకిళ్లను మంత్రి, శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం గ్రామంలో రూ.4కోట్ల వ్యయంతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి నిబద్ధతకు నిలువుట్టద్దంగా ప్రజాప్రభుత్వం నిలిచిందన్నారు. అందుకు నిదర్శనం ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాలేనని చెప్పారు. వస్తు సేవా పన్ను తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువుల కొనుగోలులో ఏటా రూ.15వేలు మిగులుదల ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే రాష్ట్రంలో రూ.10వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవను పొగాకు రైతులు ఎన్నటికీ మరిచిపోరని చెప్పారు. ఇప్పటికే 20 మిలియన్‌ కేజీల నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేశామని, అదనంగా మరో 20 మిలియన్ల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వివరించారు. ఈకార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు విన్నకోట రవి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్దపూడి విజయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ గుంజి వెంకట్రావు, ఆర్డీవో గ్లోరియా, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లవన్న, టీడీపీ నాయకులు విన్నకోట సతీష్‌, రాష్ట్ర ముస్లిం మైనార్జీ డైరెక్టర్‌ షంషుద్దీన్‌, తిరుములశెట్టి శ్రీహరి, కంచేటి శ్రీహరి పాల్గొన్నారు.

కల్యాణ మండపం ప్రారంభం

ఈ సందర్భంగా నూతలపాడులో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ఏలూరి, మంత్రి పార్థసారథిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత పెదపూడి విజేయ్‌ కుమార్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పోలూరి శివారెడ్డి పాల్గొన్నారు.


ఇంకొల్లులో పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఏలూరి

ఇంకొల్లు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో రాణించాలంటే ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. భారత పౌర విమానయానశాఖ అనుమతితో డ్రోన్‌ల్యాబ్‌ టెక్నాలజీ్‌స, అహ్మదాబాద్‌ మారుతి ఐటీఐ వారిచే సంయుక్తంగా ఇంకొల్లులో ఏర్పాటు చేసిన డ్రోన్‌ శిక్షణా కేంద్రాన్ని (రిమోట్‌ పైలట్‌ ట్రేనింగ్‌ ఆర్గనైజేషన్‌) బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డ్రోన్‌ను ఆపరేట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం కారుమూడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగన సభలో ఏలూరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో యువతకు ఉపయోగపడే ఆలోచనతో డ్రోన్‌ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ కారుమూడి శ్రీనివాసరావు, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా అన్నదాన మణి హాజరై హాస్యప్రాసలతో సభీకులను అలరింపజేశారు. అనంతరం కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Updated Date - Oct 01 , 2025 | 11:44 PM