Share News

పులులెన్ని?

ABN , Publish Date - Dec 10 , 2025 | 02:32 AM

నల్లమల అటవీ ప్రాంతంలో పులుల లెక్కింపు ప్రక్రియ మొదటి దశ ముగిసింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకొకసారి నిర్వహించే జాతీయ పులుల గణన (ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌) ఈ నెల 1న ప్రారంభమై 8వ తేదీ వరకూ సాగింది.

పులులెన్ని?
అడవిలో పులి పాదముద్రలను వీడియో తీస్తున్న అటవీ సిబ్బంది (ఫైల్‌)

నల్లమలలో మొదటిదశ లెక్కింపు పూర్తి

అటవీ ప్రాంతంలో ఈనెల 1 నుంచి 8 వరకు ప్రక్రియ

జనవరిలో రెండో దశ ఉండే అవకాశం

అప్పుడు కెమెరా ట్రాపింగ్‌ ద్వారా గణన

త్రిపురాంతకం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలో పులుల లెక్కింపు ప్రక్రియ మొదటి దశ ముగిసింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకొకసారి నిర్వహించే జాతీయ పులుల గణన (ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌) ఈ నెల 1న ప్రారంభమై 8వ తేదీ వరకూ సాగింది. మొత్తం ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటిదశ ఫీల్డ్‌ డేటా సేకరణ, రెండో దశలో కెమెరా ట్రాపింగ్‌, మూడో దశలో డేటా అనాలసిస్‌, అంచనా నివేదిక ద్వారా మొత్తం లెక్కింపు చేపడతారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యను ప్రకటిస్తారు.

మొదటి దశలో చేసింది ఇదీ..

ఫీల్డ్‌ డేటా సేకరణకు నాగార్జునసాగర్‌- శ్రీశైలం పులుల అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్‌ పరిధిలోని సిబ్బంది, బీట్‌, రేంజ్‌ అధికారులు కలిసి పనిచేశారు. మొదటి దశలో ముందుగా నిర్ణయించుకున్న రేఖాంశ మార్గాలను అనుసరించి నడుస్తూ పాదముద్రలను గుర్తించారు. జంతువుల విసర్జనలు, రాలిపడిన వెంట్రుకలు, గర్జనలు, శబ్దాల ఆధారంగా డేటా నమోదు చేశారు. జీపీఎస్‌ ఆధారిత వివరాలు కూడా అందులో పొందుపరిచారు. పులులతో పాటు జింకలు, పందులు, కుందేళ్లు, ఇతర శాఖాహార జంతువులను కూడా ఇదేసమయంలో లెక్కించారు. వన్యప్రాణుల నివాస పరిస్థితులను కూడా ఈ విడత సేకరించారు. అంటే వాటి నివాస ప్రాంతాల్లో నీటి వనరులు, గడ్డి, వేటాడే జంతువులకు లభ్యమయ్యే ప్రాంతాలు, మానవ జోక్యం ఉండే ప్రాంతాలను గుర్తించారు. రెండో విడత మరికొంత సమాచారాన్ని సేకరిస్తారు.

కెమెరా ట్రాపింగ్‌ ద్వారా రెండో దశ

పులుల లెక్కింపులో అత్యంత కీలకమైనది రెండో దశ. అడవి గుండా పులులు వచ్చే మార్గాల్లో కెమెరాలు అమరుస్తారు. ఇవి 24 గంటలూ పనిచేస్తాయి. ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి 30 లేదా 60 రోజులపాటు ఈ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా లెక్కింపు ప్రక్రియ చేస్తారు. రాత్రిళ్లు కూడా ఫొటోలు కనిపించేలా సాంకేతికపరమైన జాగ్రత్తలతో ఈ కెమెరాలను అమరుస్తారు. దీనిద్వారా పులుల కదలికలతోపాటు వాటి ప్రవర్తన కూడా తెలుసుకునే వీలు కలుగుతుందని అటవీ అధికారులు చెప్తున్నారు.

డేటా అనాలసిస్‌తో మూడో దశ

మూడో విడతలో సేకరించిన డేటా అనలసి్‌సతో ఉన్నతాధికారులు అంచనా వేసి నివేదిక తయారు చేస్తారు. కెమెరాలో కనిపించిన ప్రతి పులిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సహాయంతో పరిశీలిస్తారు. తద్వారా ప్రతి పులికీ ఒక గుర్తింపు నంబరు కేటాయిస్తారు. మొత్తం ప్రక్రియ పూర్తికి మరో మూడునెలలు పట్టే అవకాశం ఉంది. అనంతరం పులుల పూర్తి సంఖ్యను అటవీశాఖ ప్రకటిస్తుంది.

Updated Date - Dec 10 , 2025 | 02:32 AM