Share News

ముందుకెలా..

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:35 PM

ఉమ్మడి జిల్లాకు తలమానికంగా, పాడి రైతులకు బాసటగా నిలిచిన ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై కదలిక మొదలైంది. ఎలా ముందుకు పోవాలనే దానిపైనే ఉన్నత స్థాయిలో తర్జనభర్జన సాగుతోంది. ఇటు జిల్లా టీడీపీ నాయకులు, అటు అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకే్‌షలు దృఢనిశ్చయంతో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒంగోలు డెయిరీని సమాధి కట్టగా ఆ సంస్థను పునఃప్రారంభించడం ద్వారా పాడిరైతులకు తద్వారా జిల్లాలో పాడిపరిశ్రమకు ఊతం ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. అలాగే డెయిరీ అధికారులు సంస్థకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇక కార్యాచరణే మిగిలి ఉంది.

ముందుకెలా..
ఒంగోలు డెయిరీ

డెయిరీ పునరుద్ధరణపై ఉన్నత స్థాయిలో తర్జనభర్జన

పలు ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి డాక్టర్‌ స్వామి

మరో మంత్రి గొట్టిపాటితోనూ విస్తృత చర్చ

చంద్రబాబు దృష్టికి విడిగా తీసుకెళ్లిన దామచర్ల

అసెంబ్లీ సమావేశాల సమయంలో మరోసారి సీఎంను కలిసే అవకాశం

ఆస్తులు, అప్పులపై నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు

ఉమ్మడి జిల్లాకు తలమానికంగా, పాడి రైతులకు బాసటగా నిలిచిన ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై కదలిక మొదలైంది. ఎలా ముందుకు పోవాలనే దానిపైనే ఉన్నత స్థాయిలో తర్జనభర్జన సాగుతోంది. ఇటు జిల్లా టీడీపీ నాయకులు, అటు అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకే్‌షలు దృఢనిశ్చయంతో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒంగోలు డెయిరీని సమాధి కట్టగా ఆ సంస్థను పునఃప్రారంభించడం ద్వారా పాడిరైతులకు తద్వారా జిల్లాలో పాడిపరిశ్రమకు ఊతం ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. అలాగే డెయిరీ అధికారులు సంస్థకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇక కార్యాచరణే మిగిలి ఉంది.

ఒంగోలు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలకమైన పాడి పరిశ్రమకు ప్రాణం లాంటి ఒంగోలు డెయిరీని పునరుద్ధరించేందుకు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ప్రధానంగా జిల్లా మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి చొరవ చూపి ఆరుమాసాలుగా వివిధ స్థాయిల్లో కదలించారు. ఒకవైపు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కీలక అధికారులతో తరచూ ఈ అంశంపై మాట్లాడుతూ తగు నివేదికలు, సూచనలు ఇస్తున్నారు. ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి పలు ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు సమాచారం. పాడిపరిశ్రమ, డెయిరీ నిర్వహణపై విశేష అవగాహన ఉన్న ఆయన తన దృష్టికి తెచ్చిన పలు ప్రతిపాదనలను సావదానంగా వింటూనే సాధ్యాసాధ్యాలపై పలు అనుమానాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోసారి వివరంగా మాట్లాడాలని ఆయన మంత్రి స్వామికి సూచించినట్లు తెలుస్తుండగా ఈ అంశాలపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కూడా మంత్రి స్వామి చర్చించినట్లు సమాచారం.

నివేదికల రూపకల్పన

ప్రధానంగా ఒంగోలు డెయిరీ ప్రాధాన్యత, సంస్థ ఏర్పాటు, అనంతరం ఆ సంస్థ అభివృద్ధి తీరు, ఉమ్మడి జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి, రైతులకు డెయిరీ వల్ల జరిగిన మేలు, సుదీర్ఘకాలం టీడీపీ చేతిలో పాలకమండలి సాగడం తెలిసిందే. డెయిరీ అభివృద్ధికి పలు సందర్భాలలో ఒకప్పుడు ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబులు సీఎంలుగా సహకారం అందించారు. ఉద్దేశపూర్వకంగా వైసీపీ ప్రభుత్వం డెయిరీని ముంచేసింది. అటువంటి అంశాలతోపాటు ప్రస్తుత డెయిరీకి ఒంగోలుతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములు, భవనాలు, మిషనరీ వంటి ఆస్తులు, వాటి విలువ, సంస్థకు ఉన్న అప్పులు తదితర అంశాలపై ఇప్పటికే జిల్లా, రాష్ట్ర అధికారులతో చర్చించి నివేదికల రూపకల్పనకు మంత్రి స్వామి ఆదేశించారు. అదేసమయంలో ఆ రంగంపై అవగాహన, అనుభవం ఉన్న వివిధ వర్గాల వారితోనూ కొంతకాలంగా మంత్రి స్వామి సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఆయన ఆదేశంతో గతనెలలో కొందరు అధికారులు అలాగే గతంలో డెయిరీ నిర్వహణలో భాగస్వాములైన కొందరు పాలకసంస్థల ప్రతినిధులతోనూ జేసీ గోపాలకృష్ణ సమీక్షలు చేశారు.


అందరూ కలిసి ముందుకు

ప్రస్తుతం ఆ రంగంలో ఉన్న తీవ్రమైన పోటీలో డెయిరీ ఏ మేరకు సంతృప్తికరంగా నడపగలం, అందుకు ఉన్న ప్రతికూల, సానుకూల పరిస్థితులు ఏమిటి అనే అనుమానాలను సీఎం వ్యక్తం చేస్తూ మరోసారి మాట్లాడాదామని చెప్పినట్లు సమాచారం. ఇదే అంశాలపై ఇరువురు మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌ మధ్య చర్చ సాగగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులందరూ చర్చించుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు మాత్రం ప్రస్తుతం డెయిరీ ఆస్తులు, వాటి విలువ, భవనాలు, మిషనరీ స్థితిగతులు అలాగే సంస్థ అప్పులు తదితర అంశాలపై దృష్టిసారించారు. ఆయా అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

మూడు ప్రతిపాదనలు చర్చకు....

పూర్వ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా రెండుసార్లు కలెక్టర్ల సమావేశాల సందర్భంగా కూడా డెయిరీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పునరుద్ధరణకు పలు చర్యలను వివరించారు. తాజాగా పదిరోజుల క్రితం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కూడా పలు అంశాలపై సీఎంను కలిసిన సందర్భంగా డెయిరీ అంశాన్ని ప్రత్యేకంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇలా పలు సందర్భాలలో చర్చలు సందర్భంగా డెయిరీ పునరుద్ధరణకు సంబంధించి మూడు ప్రధాన ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. అందులో పూర్తిగా ప్రభుత్వపరంగా నిధులు ఇచ్చి అటు అధికారులు, ఇటు కొందరు పాలసంఘం ప్రతినిధులతో కమిటీ ద్వారా నిర్వహణ ఒక అంశం కాగా నిర్వహణ బాధ్యతను కొంతకాలం పీపీపీ విధానంలో ముందుకు వచ్చే ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మరొక అంశంగా ఉంది. ఇక గతంలో నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌(ఎన్‌డీడీబీ)తో ఒప్పందం చేసుకొని అభివృద్ధి చేయడం మూడో అంశంగా ప్రతిపాదనలు వచ్చాయి. అందులో ఎన్‌డీడీబీతో కలిసి నిర్వహించడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువమంది నుంచి వినిపిస్తుంది. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సీఎం ముందు ఉంచినట్లు సమాచారం.

Updated Date - Sep 13 , 2025 | 10:35 PM