ఇంటి పన్ను చెల్లింపు సులభతరం
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:10 AM
గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే ఇంటి పన్నులు దారిమళ్లకుండా నేరుగా పంచాయతీ అకౌంట్లకు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్ ద్వారా పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించింది.
కుటుంబ యజమానే నేరుగా ఫోన్ ద్వారా చెల్లించే అవకాశం
నిధులు దారిమళ్లకుండా ఉండేందుకు సర్కారు సరికొత్త విధానం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే ఇంటి పన్నులు దారిమళ్లకుండా నేరుగా పంచాయతీ అకౌంట్లకు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్ ద్వారా పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించింది. జిల్లాలో 729 గ్రామ పంచాయతీల పరిధిలో గృహాలు (అసెస్‌మెంట్లు) 4.75 లక్షలు ఉన్నాయి. ఏటా పంచాయతీలకు పన్నుల రూపంలో సుమారు రూ.31కోట్లకుపైగా వస్తోంది. దానితో గ్రామాల్లో జనరల్ ఫండ్ పేరుతో పలు రకాల పనులు చేసే అవకాశం ఉంది. అయితే పన్నులు పంచాయతీల్లో వసూలు చేస్తున్నా బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో జమ కావడం లేదు. ఆ నిధులు దారిమళ్లడంతోపాటు అనేక పంచాయతీల్లో ఖర్చు చేయకుండానే చేసినట్లు బ్యాలెన్స్ నిల్ చూపుతున్నారు.
ఆధార్ అనుసంధానంతో..
పన్నుల ద్వారా పంచాయతీలకు సమకూరే సొమ్ము దారిమళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి ఎంత పన్ను బకాయి ఉంటే అంత పంచాయతీ బ్యాంకు అకౌంట్‌కు జమయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే గ్రామాల్లో అసెస్‌మెంట్ల సర్వే పూర్తయింది. ఇంటి యజమాని ఆధార్‌తోపాటు, ఫోన్ నంబరును కూడా అనుసంధానం చేశారు. గతంలో గృహాలకు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఆ ఇంటి యజమానికి ఎలాంటి ఆధారం ఉండేది కాదు. కానీ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఇంటి ద్వారా బ్యాంకుల్లో అవసరమైనప్పుడు రుణాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పంచాయతీ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాజాగా క్యూఆర్ కోడ్ ద్వారా పన్నుల చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పంచాయతీలకు ఒనగూరే ప్రయోజనాలపై కూడా దృష్టి సారించారు.