ఇంటికో బాధితుడు
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:35 AM
జ్వరం.. ఒళ్లు నొప్పులు.. నలత.. కొందరిలో జలుబు, దగ్గు, తలనొప్పి.. ఇదీ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో జిల్లాలో జ్వరపీడితులు అధికమవుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు.
జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట
వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జ్వరం.. ఒళ్లు నొప్పులు.. నలత.. కొందరిలో జలుబు, దగ్గు, తలనొప్పి.. ఇదీ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో జిల్లాలో జ్వరపీడితులు అధికమవుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ఆర్‌ఎంపీల వద్ద కూడా క్యూకడుతున్నారు. కొందరైతే మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. తమకు కలిగిన లక్షణాలను తెలియజేస్తూ మందుబిళ్లలతో సరిపెట్టుకుంటున్నారు. ఇదేవిషయమై వైద్యులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జ్వరపీడితులు పెరుగుతున్న మాట వాస్తవమే అంటున్నారు. ఈ జ్వరం ఐదు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్‌ను సంప్రదించి, వైద్య సహాయం పొందితే ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు.
జీజీహెచ్‌కు పెరుగుతున్న ఓపీలు
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య వారంరోజులుగా పెరిగింది. సాధారణ రోజుల్లో 700 నుంచి వెయ్యి వరకు ఉండే ఓపీలు గత వారం, పదిరోజులుగా సుమారు 1,500కు చేరాయి. మొత్తం మీద వారంలో 8వేల మంది ఔట్‌పేషెంట్‌లు వివిధ కారణాలతో ఆసుపత్రికి వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. వారిలో అత్యధిక శాతం మంది జ్వర పీడితులేనని వారు వివరించారు. దీంతో ఆసుపత్రిలోని అన్ని వార్డులు కిటకిటలాడుతున్నాయి.
ముందస్తు చర్యలు కరువు
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దోమలదాడి తీవ్రమైంది. పట్టించుకోవాల్సిన యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా నగరంలోపలు స్థలాల్లో మరుగునీరు నిలిచి కంపుకొడుతోంది. అంతేకాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా బ్లీచింగ్, ఫాగింగ్, ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ విడుదల, మురుగు నీటి కుంటలు, చెరువుల్లో గంభూషియా చేపల విడుదల చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటీకీ ఆదిశగా చర్యలు కూడా లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
వాతావరణంలో మార్పులే కారణం
పగటి వేళ మండుతున్న ఎండ, రాత్రివేళలో ఉక్కపోత ఆపై వేకువజామున చలి, అప్పుడప్పుడూ వర్షం.. ఈ కారణంగానే ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రతి సంవత్సరం మూడు సీజన్ల మధ్యలో ఇలా జరగడం సర్వసాధారణం అంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు.