ఇళ్ల పండుగ
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:18 AM
జిల్లాలో బుధవారం పక్కా గృహ ప్రవేశాలు, భూమిపూజ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల్లోని అధికారులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా అనేక చోట్ల గృహప్రవేశాలు నిర్వహించారు.
వైభవంగా గృహప్రవేశాలు, భూమిపూజ
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఒంగోలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం పక్కా గృహ ప్రవేశాలు, భూమిపూజ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల్లోని అధికారులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా అనేక చోట్ల గృహప్రవేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రప్రభుత్వ భాగస్వామ్య పథకాల ద్వారా మూడు లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటన్నింటికీ ఒకేరోజున బుధవారం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాగే వివిధ దశల్లో నిర్మాణాలు జరిగిన ఇళ్లకు బిల్లుల చెల్లింపు, కొత్త వాటి నిర్మాణాలకు భూమి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో నిర్వహించగా తదనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలో మొత్తం ఈ 17నెలల కాలంలో రూ.17.77 కోట్ల విలువైన 7,372 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. వాటి ప్రారంభాలతోపాటు వివిధ దశల్లో నిర్మాణాలు జరిగిన 11,443 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు రూ.18.36 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు. కొన్నిచోట్ల కొత్తగా నిర్మాణాలకు భూమిపూజలతోపాటు కొందరు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఆహ్లాదకర వాతావరణంలో..
ఒంగోలు నగరపరిధిలోని కేశవరాజుకుంటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. సంతనూతలపాడు మండలం మంగమూరులో ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ హాజరయ్యారు. పామూరు మండలం వగ్గంపల్లెలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గృహాలను ప్రారంభించారు. మార్కాపురం పట్టణంలోని 15వ వార్డులో అక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. దర్శి మండలం కొత్తపల్లిలో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడులో వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు. ఇతర ప్రాంతాల్లో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి గృహ నిర్మాణ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఇళ్లు, స్థలాలను ప్రత్యేకంగా అలంకరించి ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు.