రూ.100కోట్లతో ఉద్యాన క్లస్టర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:08 AM
ఉద్యాన పంట ఉత్పత్తులకు విలువ పెంపు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించేలా క్లస్టర్ విధానం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సిద్ధమయ్యాయి. ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న విధానంలో ఉద్యాన పంటలు అధికంగా ఉండే జిల్లాల్లో గరిష్ఠంగా రూ.100 కోట్లతో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు భారీ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరికొత్త నిర్ణయం
ఆయా వర్గాల ప్రతినిధులతో అధికారుల వర్క్‌షాప్
ఉద్యాన పంట ఉత్పత్తులకు విలువ జోడింపు ప్రధానాంశం
ఒంగోలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఉద్యాన పంట ఉత్పత్తులకు విలువ పెంపు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించేలా క్లస్టర్ విధానం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సిద్ధమయ్యాయి. ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న విధానంలో ఉద్యాన పంటలు అధికంగా ఉండే జిల్లాల్లో గరిష్ఠంగా రూ.100 కోట్లతో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు భారీ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాయి. అందులో మన జిల్లా కూడా ఎంపికైంది. క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చే వారిని గుర్తించేందుకు అధికారులు మంగళవారం ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహించారు. ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీచంద్ నేతృత్వంలో స్థానిక కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కోల్డ్ స్టోరేజీ యజమానులు, ఆ రంగంలో ఉన్న అభ్యుదయ పారిశ్రామిక వేత్తలు, ఎగుమతిదారులు, తోటల సాగుపై రైతులను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. హార్టికల్చర్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్ వై.విద్యాశంకర్, నాబార్డు డీజీఎం రవికుమార్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యాన పంటల శాస్త్రవేత్త ఎం.రవీంద్రబాబులు హాజరై పలు అంశాలను వివరించారు.
40శాతం రాయితీ
ప్రధానంగా ఉద్యాన పంటల క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన విధి విధానాలు, కేంద్ర, రాష్ట్ర హార్టికల్చర్ మిషన్ల ద్వారా అందే రాయితీలను అధికారులు వివరించారు. సాంకేతిక సలహాలు, ఉద్యాన పంటల సాగు పెంపు, తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతులు, యూనిట్ ఏర్పాటు వల్ల రైతులకు జరిగే మేలు, యూనిట్ ఏర్పాటుకు నిధుల సమీకరణ తదితరాలను వెల్లడించారు. క్లస్టర్ యూనిట్ ఏర్పా టుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు మూడు మాసాల్లో సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి ఉంది. గరిష్ఠంగా రూ.100 కోట్లతో క్లష్టర్ ఏర్పాటుకు అవకాశం ఉందని, అందులో 40శాతం రాయితీ లభిస్తుందని ఉద్యాన శాఖ ఏడీ గోపీచంద్ తెలిపారు.