ఆయన రూటే సప‘రేటు’
ABN , Publish Date - Jun 16 , 2025 | 10:45 PM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జలవనరుల శాఖకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో ఆ కార్యాలయం వైపు తొంగి చూసిన కాంట్రాక్టర్ లేరు. కానీ గత సంవత్సరం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ పరిస్థితి మారింది. జలవనరుల శాఖ కార్యాలయం కళ కూడా మారింది.
జలవనరుల శాఖలో అవినీతి జలగ
చేతులు తడపందే ఫైళ్లు కదలవు
మధ్యాహ్నం 12 దాటితే ఆఫీసే బార్
మార్కాపురం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జలవనరుల శాఖకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో ఆ కార్యాలయం వైపు తొంగి చూసిన కాంట్రాక్టర్ లేరు. కానీ గత సంవత్సరం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ పరిస్థితి మారింది. జలవనరుల శాఖ కార్యాలయం కళ కూడా మారింది. డివిజన్ మొత్తం చెరువుల ఆధునికీకరణకు ప్రభుత్వం సమృద్ధిగా నిధులు కేటాయించింది. దీంతో మళ్లీ కాంట్రాక్టర్‌లతో ఆ కార్యాలయంలో కళకళలాడుతోంది. ఇదే అదునుగా భావించారు డివిజన్ ఈఈ కార్యాలయంలో పనిచేసే ఓ కీలక ఉద్యోగి. రెగ్యులర్ అధికారి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పోస్టు చిన్నదే అయినా అతను చెప్పిందే వేదంగా మారింది. అతని ప్రమేయం లేనిదే ఎలాంటి ఫైళ్లయినా ఆఫీసులోంచి కదలవు. డీఈ స్థాయి అధికారులు కూడా అతను చెప్పినట్లు వినాల్సిందే. ఉద్యోగుల యూనియన్‌లో కూడా కీలకమైన పదవుల్లో ఉండడంతో అతని జోలికి వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన చిన్నపాటి కాంట్రాక్టర్‌ల వద్ద కూడా ముక్కుపిండి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అది ఎంతటి పనైనా లెక్కకట్టీ అతనికి సమర్పించుకోవాల్సిందే. మధ్యవర్తులు, దళారులతో పనిలేకుండా నేరుగా లంచం తీసుకోవడం ఆయన నైజం. అంతేకాక మధ్యాహ్నం అయిందంటే చాలు అతని కార్యాలయాన్ని బార్‌గా మార్చుకోవడం పరిపాటిగా మారింది. అతని ఆఫీస్ ర్యాకుల్లో ఎప్పుడూ మద్యం సీసాలు దర్శనమిస్తుంటాయి. ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోవడం, ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అతను ఏం చేసినా సాగిపోతోందని కార్యాలయంలో పలువురు ఉద్యోగులు చెప్తున్నారు. ఒకసారి ఎస్‌ఈ కార్యాలయానికి బిల్లు కోసం పంపిన ఫైలు వెనక్కి వచ్చింది. దానిని మళ్లీ పంపేందుకు కూడా లంచం డిమాండ్ చేయడంతోనే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను అశ్రయించినట్లు తెలుస్తోంది. వ్యవహారంలోనే డబ్బులు తీసుకుంటూ సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఎంతటి వారైనా కప్పం కట్టందే ఫైళ్లు కదలవు
మార్కాపురం జలవనరుల శాఖ ఈఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కాకి శ్రీనివాసరావు అవినీతికి కేరా్‌ఫగా మారారు. డివిజన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పని జరిగినా ఆయన వద్ద నుంచే ఫైళ్లు ఉన్నతాధికారుల టేబుల్‌ల మీదికు వెళ్లాలి. పని దక్కించుకున్న కాంట్రాక్టర్‌తో ముందుగా పర్సంటేజీల విషయమై డీల్ కుదుర్చుకునేది అయనే. అన్నీ అనుకున్నట్లు కాంట్రాక్టర్ చేయి తడిపితే ఫైళ్లు ముందుకు కదిలి బిల్లులు వస్తాయి. ఏ మాత్రం ఆయన్ని పట్టించుకోకపోయినా, లెక్క తగ్గినా ఇక అంతే సంగతులు. నెలలు, సంవత్సరాలు గడిచినా బిల్లులు రాకుండా కొర్రీలు వేయగల సమర్ధుడు. దీంతోనే అతనంటే కాంట్రాక్టర్లు హడలెత్తి పోతున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ పనులకు సంబంధించి 15 నుంచి 20 శాతం పర్సంటేజీలు నడుస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్‌ల వద్ద లంచాలు తీసుకోవడం ఒక ఎత్తైతే చివరికి అధికారులను కూడా ఆయన వదల్లేదని తెలుస్తోంది. ఈ మధ్యనే మార్కాపురం వచ్చిన ఓ అధికారికి సంబంధించిన ఇంక్రిమెంట్ల బిల్లుల ఫైళ్లు ఉన్నతాకారులకు పంపడానికి కూడా లంచం డిమాండ్ చేసినట్లు ఆఫీసు వర్గాలు తెలిపాయి. వాస్తవానికి చాలా చిన్నపనే అయినా సబ్ డివిజన్‌స్థాయి అధికారి అయిన ఆయన రూ.15వేలు లంచం ఇవ్వందే ఫైలు పంపనట్లు తెలిసింది. తిలాపాపం తలా గరిటెడులా పర్సంటేజీల్లో అన్ని స్థాయిల అధికారులకు వాటాలు ఉండడంతోనే అతను చెప్పినట్లే నడుస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం అయితే మద్యం పరవళ్లు
పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు చేయించుకునేందుకు కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయడం సహజం. ఈ క్రమంలో కీలకమైన ఆ ఉద్యోగి వద్దకు వెళ్తే సర్పంటేజీలతోపాటు మద్యం సీసాలు కూడా ఇవ్వాల్సిందే. మధ్యాహ్నం 12.00 గంటలు దాటితే అతని కార్యాలయం బార్‌గా మారిపోవడం పరిపాటి. ఆఫీస్ టేబుల్‌పైనే ఉద్యోగుల యూనియన్‌లోని సహచరులు, కాంట్రాక్టర్‌లతో కలిసి పనివేళల్లోనే పూటుగా మద్యం తాగడం అతని ఆనవాయితీ. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులు మందలించినా పరిస్థితిలో మార్పురాలేదని కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఏసీబీ అఽధికారులు సోమవారం చేసిన దాడుల్లో కూడా కొన్ని సీసాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం.