గనుల్లో ఆక్రమణలపై హైకోర్టు సీరియస్
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:37 AM
గెలాక్సీ గ్రానైట్ గనుల యజమానుల్లో కొందరు వాగులు, కాలువలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తుండటంపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, తదుపరి కార్యాచరణను నివేదించాలని అధికారులను ఆదేశించింది.
తీసుకున్న చర్యలను నివేదించాలని ఆదేశం
విచారణను ఆరు వారాలు వాయిదా వేసిన ధర్మాసనం
మైన్స్ అధికారుల మల్లగుల్లాలు.. ప్రత్యేక సమావేశం
చీమకుర్తి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : గెలాక్సీ గ్రానైట్ గనుల యజమానుల్లో కొందరు వాగులు, కాలువలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తుండటంపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, తదుపరి కార్యాచరణను నివేదించాలని అధికారులను ఆదేశించింది. విచారణను ఆరు వారాలపాటు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి, రామతీర్థం పరిసర ప్రాంతాల్లో గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ విస్తరించింది. దాదాపు 42 క్వారీలకు సంబంధించి 150కి పైగా లీజులు మంజూరయ్యాయి. లీజుదారుల్లో కొందరు నిబంధనలను ఉల్లంఘించారు. తమ పట్టాభూములకు సమీపంలో ఉన్న వాగు, కొండ పోరంబోకు, ఇరిగేషన్‌తోపాటు ప్రభుత్వ భూములను ఆక్రమించి క్వారీయింగ్ చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కొందరు జిల్లా ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి కోరారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం ఆక్రమణల గుర్తింపు, తొలగింపుపై తీసుకున్న చర్యలను వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. జిల్లా మైన్స్ అధికారులు గురువారం ఒంగోలులోని కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు ఆదేశాలను సమీక్షించి నివేదించాల్సిన అంశాలపై చర్చించారు. తదుపరి వాయిదా లోపు గెలాక్సీ గ్రానైట్ గనుల్లో నెలకొన్న ఆక్రమణలను తేల్చాలని నిర్ణయించుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకొని న్యాయస్థానానికి నివేదించాలన్న యోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఆక్రమణలపై గత కొన్ని నెలల క్రితం జాయింట్ కమిటీతో సర్వే ప్రారంభించిన అధికారులు మధ్యలోనే రాజకీయ ఒత్తిళ్లతో నిలిపివేశారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో మళ్లీ కదిలారు. ఎంత మేరకు సర్వే చేసి ఆక్రమణలపై నిగ్గు తేలుస్తారో వేచి చూడాల్సి ఉంది.