ట్రంక్‌రోడ్డు విస్తరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:23 AM
ఒంగోలులో కీలకమైన ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. నగర అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే పలు రహదారుల విస్తరణ పనులు జరుగుతుండగా, అందులో ముఖ్యమైన ట్రంక్‌రోడ్డుకు సంబంధించి పదేపదే ఆటంకాలు ఎదురయ్యాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులు విస్తరించాలని అధికారులు తొలుత భావించారు.
ప్రజా ప్రయోజనం దృష్ట్యా నిబంధనల మేరకు ఓకే
12న కార్పొరేషన్ కౌన్సిల్‌లో ఆమోదం
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో కీలకమైన ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. నగర అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే పలు రహదారుల విస్తరణ పనులు జరుగుతుండగా, అందులో ముఖ్యమైన ట్రంక్‌రోడ్డుకు సంబంధించి పదేపదే ఆటంకాలు ఎదురయ్యాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులు విస్తరించాలని అధికారులు తొలుత భావించారు. అందుకు ట్రంక్‌రోడ్డు వ్యాపారులు అంగీకరించకపోవడంతో ఆరు నెలలుగా వాయిదా పడుతూ వచ్చింది. 100 అడుగులు వద్దని కొందరు.. 60 అడుగులు చేయాలని మరికొందరు.. ఇలా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా 80 అడుగులకు విస్తరించాలని ఒక నిర్ణయానికి వచ్చిన క్రమంలో ఇటీవల కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోతున్న తమకు నష్టపరిహారంతోపాటు షాపులు కట్టించి ఇవ్వాలని కోరారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా రహదారి విస్తరణ చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు వ్యాపారులకు నష్టం కలగకుండా ఉండేలా చూడాలని పేర్కొంది. నష్టపరిహారం కింద నాలుగు రెట్లు టీడీఆర్ బాండ్‌లు ఇవ్వాలని, వ్యాపారులు అందుకు అంగీకరించకపోతే భూసేకరణ చట్టం ప్రకారం రెవెన్యూ శాఖ ద్వారా తగు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఆదేశించింది. దీంతో ఈనెల 12న జరిగే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో రోడ్డు విస్తరణకు ఆమోదం తెలియజేనున్నారు.