Share News

ఇటు భగభగలు.. అటు వడగండ్లు

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:13 AM

జిల్లాలో శనివారం భానుడు భగభగ మండాడు. పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు తోడు వేడిగాలులు కూడా మొదలయ్యాయి. అదే సమయంలో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతోపాటు పలుచోట్ల జల్లులు పడ్డాయి. పీసీపల్లి మండలంలో వడగండ్ల వాన కురిసింది.

ఇటు భగభగలు.. అటు వడగండ్లు
పీసీ పల్లి మండలం కమ్మవారిపల్లెలో వేపచెట్టు విరిగిపడడంతో తెగిపోయిన విద్యుత్‌ తీగలు

పలుచోట్ల 42 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదు

సాయంత్రానికి చల్లబడి జల్లులు

ఎండలు మరింత ముదిరే అవకాశం

ఒంగోలు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం భానుడు భగభగ మండాడు. పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు తోడు వేడిగాలులు కూడా మొదలయ్యాయి. అదే సమయంలో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతోపాటు పలుచోట్ల జల్లులు పడ్డాయి. పీసీపల్లి మండలంలో వడగండ్ల వాన కురిసింది. గత నెలాఖరు నుంచి జిల్లాలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కసారిగా తీవ్రత పెరిగింది. ఉదయం 10గంటల నంచే ఎండ మండింది. మధ్యాహ్నం 12 గంటలకే చాలాచోట్ల 39 నుంచి 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రభావం కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రాష్ట్రంలో అత్యధికంగా మర్రిపూడి మండలం జువ్విగుంటలో 40.28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1 గంట సమయంలో వైపాలెం మండలంలో గోళ్లవిడిపిలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 41.33 డిగ్రీల ఎండ కాచింది.

దరిమడుగులో 42.90 డిగ్రీలు

రాష్ట్రంలో ప్రభుత్వం ఉష్ణోగ్రతలు నమోదు చేసే 1,599 సెంటర్లలో 33చోట్ల మధ్యాహ్నం 2 గంటల సమయంలో 41 డిగ్రీలపైన నమోదైంది. అందులో ఐదు కేంద్రాలు మన జిల్లాలోనే ఉన్నాయి. ఆ సమయంలో తర్లుపాడులో గరిష్ఠంగా 41.30 డిగ్రీలు నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో ఎండలు కాచాయి. మార్కాపురం మండలం దరిమడుగులో సాయంత్రం 4 గంటల తర్వాత కూడా 42.90 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం ఎండ తీవ్రతను తెలియజేస్తోంది. ఇక జిల్లా కేంద్రమైన ఒంగోలులోనూ శనివారం ఎండమండింది. ఈ సీజన్‌లో తొలిసారిగా శనివారం 41.80 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం కన్నా శనివారం ఏకంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఇదిలా ఉండగా సాయంత్రం 4 గంటల సమయానికి కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి చల్లగాలులు వీచాయి. కొన్నిచోట్ల జల్లులు పడ్డాయి. పీసీపల్లి మండలంలో ఏకంగా వడగండ్ల వాన కురిసింది. ఇతర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఆదివారరం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశంఉంది.

పీసీపల్లిలో వడగండ్ల వాన

పీసీపల్లి : మండలంలో శనివారం వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు కమ్మవారిపల్లి, పీసీపల్లిలో వేపచెట్లు, చిల్లచెట్లు విరిగిపడ్డాయి. అవి కొన్ని చోట్ల విద్యుత్‌ తీగలపై పడడంతో తెగిపోయాయి. స్థానికులు సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వడంతో ఆయా ప్రాంతాలకు సరఫరాను నిలిపివేశారు. పీసీపల్లి వేబ్రిడ్జి సమీపంలో చిరువ్యాపారి ఏర్పాటుచేసుకున్న బంకుపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి. కమ్మవారిపల్లెలో పొగాకు బ్యారన్‌ల రేకులు ఎగిరిపోయాయి. పీసీపల్లిలోని కోళ్ల ఫారంలో గాలి తీవ్రతకు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. మూలవారిపల్లిలో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షపు నీటికి తడిసిపోయింది. తహసీల్దార్‌ కార్యాలయం ప్రహరీగోడ కూలిపోయింది. మాచర్లవారిపల్లిలో చిల్లచెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. స్థానికులు వాటిని తొలగించారు. దోస, పుచ్చచేలల్లో వర్షపునీరు నిలిచింది. కాయలు నాణ్యతను కోల్పోవడంతో మంచిధర రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:13 AM