Share News

గ్రామాలకు ‘స్వచ్ఛ’ చేయూత

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:09 AM

గ్రామాలకు స్వచ్ఛ జలాలు అందాలన్న లక్ష్యం.. అడుగంటిపోతున్న భూగర్భ జలాల వృద్ధి ద్వారా భవిష్యత్‌లో నీటి సమస్యకు చెక్‌ పెట్టాలన్న సంకల్పం.. ఇటువంటి ఆశయాలకు ప్రభుత్వ తోడ్పాటుతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తోడైతే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అందుకు ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు నిదర్శనం.

గ్రామాలకు ‘స్వచ్ఛ’ చేయూత
చెక్‌డ్యాం నిర్మాణ పనుల్లో కూలీలు

భూగర్భ జలాల పెంపునకు కార్యాచరణ

40 గ్రామాల్లో రూ.5 కోట్లతో పనులు

టాటా ట్రస్ట్‌ సహకారంతో విజయ వాహినీ ఫౌండేషన్‌ శ్రీకారం

త్రిపురాంతకం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామాలకు స్వచ్ఛ జలాలు అందాలన్న లక్ష్యం.. అడుగంటిపోతున్న భూగర్భ జలాల వృద్ధి ద్వారా భవిష్యత్‌లో నీటి సమస్యకు చెక్‌ పెట్టాలన్న సంకల్పం.. ఇటువంటి ఆశయాలకు ప్రభుత్వ తోడ్పాటుతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తోడైతే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అందుకు ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు నిదర్శనం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా నీటి సమస్యతో సతమతమవుతోంది. పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం నీటి వనరుల పెంపునకు కృషిచేస్తోంది. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు చేయూతను అందిస్తున్నాయి. అందులోభాగంగా ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని 40 గ్రామాల్లో దాదాపు రూ.5 కోట్ల ఖర్చుతో భూగర్భ జలాల పెంపునకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. టాటా ట్రస్ట్‌ సహకారంతో విజయవాడకు చెందిన విజయ వాహినీ ఫౌండేషన్‌ పనులను కూడా చేపట్టింది.

పంచాయతీల భాగస్వామ్యం

గ్రామాల్లో భూగర్భ జలాలు పెంపునకు తీసుకోవాల్సిన చర్యలకు గ్రామస్థాయిలోనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానిక పంచాయతీ తీర్మానాలు తీసుకుంటూ వారిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. చెక్‌డ్యాలు, , పెర్కులేషన్‌ ట్యాంకుల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు, చెరువులు, కుంటల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు రూ.5కోట్లతో చేపట్టే ఈ పనుల్లో 20 శాతం ప్రభుత్వం లేదా స్థానిక ప్రజల నుంచి నిధులు రాబట్టేలా ప్రణాళిక తయారు చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం గతంలో ఆయా గ్రామాల్లో చేసిన పనుల్లో చెక్‌డ్యాంల పునరుద్ధరణ, చెరువుల్లో పూడికతీతలు, కొద్దిపాటి మరమ్మతులను పూర్తి చేశారు. త్వరలోనే ఎంపిక చేసిన గ్రామాల్లో సమగ్ర నీటి సంరక్షణ పనులు చేపడతామని కార్యనిర్వాహకులు చెప్తున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 02:09 AM