భారీ వర్షాలకు అపార నష్టం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:10 PM
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు దర్శి ప్రాంతంలో పంటలకు అపారనష్టం జరిగింది. పంట పొలాల్లో కుంటలా నీరు నిల్వ ఉంది. దీంతో పైర్లు ఉరకెత్తి చనిపోతున్నాయి. రైతులు ఏం చేయాలో పాలుపోక కన్నీరుమున్నీరవుతున్నారు.
- పంట పొలాల్లో కుంటల్లా నిల్వఉన్న నీరు
- ఉరకెత్తిన మొక్కలు
- ఆందోళన చెందుతున్న రైతులు
దర్శి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు దర్శి ప్రాంతంలో పంటలకు అపారనష్టం జరిగింది. పంట పొలాల్లో కుంటలా నీరు నిల్వ ఉంది. దీంతో పైర్లు ఉరకెత్తి చనిపోతున్నాయి. రైతులు ఏం చేయాలో పాలుపోక కన్నీరుమున్నీరవుతున్నారు. దర్శి సబ్ డివిజన్‌లో సుమారు పదివేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ఇప్పటికీ పత్తి చేలల్లో కుంటలా నీరు నిల్వ ఉంది. భూమిలో తేమ అధికమై పత్తి చెట్లు చనిపోతున్నాయి. పత్తి కాయలు పగిలే సమయంలో మూడురోజులు వరుసగా వర్షం పడటంతో పత్తి రంగు మారిపోతుంది. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికందే సమయంలో నీటి పాలు కావటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. లేత పొగతోటలు కూడా ఉరకెత్తి చనిపోతున్నాయి. ఇప్పటికీ పొగతోటల్లో నీరు ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల సజ్జ పంట కోసే సమయంలో వర్షాలు పడటంతో కంకులు తడిసిపోయి పంట దెబ్బతింది. సజ్జ కంకులు మొలకెత్తుతుండటంతో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కాపు దశలో ఉన్న బొప్పాయి, మొక్కజొన్న పంటలు కూడా కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. మరో తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతుండటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మళ్లీ వర్షాలు కురిస్తే మిగిలిన పంటలు కూడా పూర్తిగా నీటి పాలవుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టాన్ని గుర్తించి సహాయం చేయాలని కోరుతున్నారు.