ఉరుములతో భారీ వర్షం
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:50 PM
మండలంలో శనివారం అర్ధరాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి కాల్వలలో నీళ్లు పారాయి. వర్షపునీటితో మండలంలోని చెరువులకు సగానికిపైగా నీరు చేరాయి. పిడుగులు, వర్షాల దాటికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టా లు జరగలేదు.
ఉధృతంగా వాగులు, పారిన కాల్వలు
చెరువులకు చేరిన వరద నీరు
పంటలకు మేలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
అర్ధవీడు మండలం బొల్లుపల్లి వద్ద
పెద్దారవీడు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మండలంలో శనివారం అర్ధరాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి కాల్వలలో నీళ్లు పారాయి. వర్షపునీటితో మండలంలోని చెరువులకు సగానికిపైగా నీరు చేరాయి. పిడుగులు, వర్షాల దాటికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టా లు జరగలేదు.
పంటలకు ప్రాణం
మండలంలో సాగు చేసిన మిరప, పత్తి, పొగాకు, ఇతర కూరగాయల పంటలకు శనివారం కురిసిన వర్షం ప్రాణం పోసినట్లయింది. ఇటీవల బోర్ల కింద డ్రిప్పులతో సాగు చేసిన మిరపకు ముఖ్యంగా ప్ర యోజనం చేకూర్చినట్లయింది. అంతేగాక ఉద్యాన పంటలకు సైతం ఈ వర్షం మేలు చేసినట్లయింది.
నిలిచిన కరెంట్ సరఫరా
శనివారం అర్ధరాత్రి వర్షం ప్రారంభమైనప్పటికీ మండలంలోని సబ్‌స్టేషన్ల పరిధిలో ఎటువంటి ప్ర మాదాలు తలెత్తకుండా ఉండేందుకు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు కొంతమేర ఇ బ్బంది పడ్డారు. అయినప్పటికీ ఎటువంటి ప్రమాదా లు చోటుచేసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
జీవం పోసుకున్న పైర్లు
పొదిలి : పదిరోజులుగా తరచూ కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలో సాగు చేసిన వివిధపైర్లు జీవం పోసుకున్నాయి. ఇటీవల ఎండుముఖం పట్టిన పైర్లు జీవం పోసుకున్నాయని రైతులు చెప్తున్నారు.మండలంలో అత్యధికంగా కంది 7,600 హెక్టార్లు సాగు చేసినట్లు వ్యవసాయాధికారి డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే సజ్జ 160, పత్తి 10, పొగాకు 10, వరి 20హెక్టార్లలో సాగులో ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం 55.4, శనివారం 7.6 వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
ప్రవహిస్తున్న సగిలేరు
గిద్దలూరు టౌన్ : నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు సగిలేరు ప్రవహిస్తున్నది. సగిలేరు ప్రవహిస్తుండడంతో గిద్దలూరు ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగనున్నట్లు ఆశాభావం ప్రజల్లో కలిగింది. ఇటీవల సరైన వర్షపాతం నమోదు కాక సగిలేరు ప్రవాహం లేదు. గడిచిన కొద్ది రోజులుగా నల్లమలలో కురుస్తున్న వర్షానికి తోడు ఆదివారం తెల్లవారుజామున గిద్దలూరులో 27.7 ఎంఎం వర్షపాతం నమోదు కావడంతో సగిలేరు ప్రవహిస్తున్నది. చుట్టుపక్కల వాగులు, వంకలు, చెరువులకు నీరు చేరుతున్నది.
నల్లమలలో వానలు
- ఉధృతంగా జంపలేరు, గుండ్లకమ్మ వాగులు
- కంభం చెరువుకు భారీగా వరద
కంభం : నల్లమల్ల అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు అర్ధవీడు మండలం జంపలేరు వాగు, కంభం మండల పరిధిలోని గుండ్లకమ్మ వాగులు ఉఽధృతంగా ప్రవహిస్తున్నాయి. అర్ధవీడు మండలం బొల్లుపల్లి, వీరభద్రాపురం, పెద్ద కందుకూరు, తదితర గ్రామాల సమీపంలోని చప్టాలపై నుంచి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాల మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి.
రైతుల హర్షం
భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ రెండు వాగుల నుంచి వచ్చే నీరు కంభం చెరువుకు చేరుతుండడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంభం చెరువులో 9అడుగుల మేరా నీరు ఉందని, వాగుల్లోకి నీరు చేరితే రెండు రోజుల్లో 12 అడుగులకు చేరవచ్చని ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస నాయక్ తెలిపారు.
పుల్లలచెరువు : మండల వ్యాప్తంగా శనివారం రాత్రి 60.4 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో చెరువుల్లో భారీగా నీరు చేరింది. ప్రధానంగా పుల్లలచెరువు, గంగవరం, ముటుకుల, తెల్లగట్ల, కవలకుంట్లలో భారీ వర్షం కురిసింది. తెల్లగట్లలో చెరువుకు నీరు వేళ్తె సప్లై చానల్ తెగిపోవడంతో నీరు వృథాగా పోయింది. మండలంలో సాగులో ఉన్న కంది, మిర్చి, మొక్కజొన్న పైర్లకు ఈ వర్షం ఎంతో దోహదపడతందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగులో ఉన్న పత్తికి పూత రాలిపోవడంతో, తీత దశలో ఉన్న పత్తికి కొంత మేరకు నష్టం కలిగించింది. కొన్నేళ్లుగా కరువుతో కుంగిపోతున్న రైతులకు వానలు ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు.
రాచర్ల : మండలంలో 18.4శాతం వర్షపాతం నమోదయిందని ఏఎ్‌సవో షేక్ మున్వర్ ఆదివారం తెలిపారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని కానీ మండలంలో వర్ష ప్రభావం పెద్దగా లేదన్నారు. శనివారం రాత్రి నల్లమలలో కురిసిన భారీ వానకు చెరువులు, వాగులకు నీరు చేరిందని తెలిపారు.
మార్కాపురం : గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో కురిసిన వర్షంతో డివిజన్‌లో పంటలు జీవం పోసుకున్నాయి. అన్ని రకాల పంటలకు వర్షం మేలు చేకూర్చింది. గత కొన్ని రోజులుగా డివిజన్‌లోని పలు మండలాల్లో వేసవిని తలపించే విధంగా ఎండలు భగభగ మండాయి. ఖరీఫ్ సీజన్‌లో గతంతో పోల్చితే 50 శాతం మించి పైర్లు సాగు కాలేదు. విభిన్నమైన వాతావరణ పరిస్థితులు అందుకు కారణమయ్యాయి. చాలవరకు వర్షాధారంపై ఆధారపడే ఈ ప్రాంతంలో మెట్ట పైర్ల విస్తీర్ణం సైతం దాదాపు తగ్గిపోయింది. మిర్చి, పొగాకు వేసేందుకు రైతాంగం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఖరీ్‌ఫలో బాగానే సాగయ్యే వైట్‌బర్లీ పొగాకు సైతం ఈసారి తగ్గిపోయింది.