మండువేసవిలో వాన జోరు
ABN , Publish Date - May 22 , 2025 | 01:45 AM
జిల్లాలో మండు వేసవిలో వాన జోరు కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
11 మండలాల్లో రెట్టింపు కన్నా ఎక్కువ
గిద్దలూరులో ఏకంగా నాలుగున్నర రెట్లు
చల్లబడిన వాతావరణంతో ప్రజలకు ఉపశమనం
25 నుంచి రోహిణి కార్తె
ఒంగోలు, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండు వేసవిలో వాన జోరు కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఈ నెలలో సాధారణ వర్షపాతం 51.30 మి.మీ కాగా ఇప్పటికే సుమారు 60.20 మి.మీ నమోదైంది. మూడొంతుల మండలాల్లో సాధారణం కన్నా రెట్టింపు అంతకన్నా ఎక్కువ వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో 50శాతం కన్నా అధికంగా పడింది. సాధారణంగా ఏడాది మొత్తం మీద ఎండల తీవ్రత అధికంగా ఉండేది ఈ నెలలోనే. జిల్లా అంతటా మే రెండో పక్షంలో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాంటిది ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రెండో వారంలో ఒక మోస్తరు ఎండలు ఉన్నప్పటికీ మూడో వారానికి వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి. నాలుగైదు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు అధిక ప్రాంతాల్లో సాధారణం కన్నా ఐదారు డిగ్రీల మేర తగ్గిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఈ నెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే.. 11 మండలాల్లో సాధారణం కన్నా రెట్టింపు అంతకు మించి వర్షపాతమే నమోదైంది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరులో ఏకంగా 470 శాతం అధికంగా కురిసింది. మరో 14 మండలాల్లో 50 శాతం నుంచి 96శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఎండల తీవ్రత అత్యధికంగా ఉండే రోహిణికార్తె ఈనెల 25 నుంచి ఆరంభం కానుంది. సాధారణంగా ఆ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉంటాయి. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తుండటం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ప్రస్తుత వర్షపు వాతావరణం నేపథ్యంలో ఈసారి రోహిణిలో గతంలో వలే తీవ్రత ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది ఎండల తీవ్రత నుంచి జిల్లా ప్రజలకు ఉపశమనం లభించినట్లే.