నల్లమలలో భారీ వర్షం
ABN , Publish Date - Aug 11 , 2025 | 10:15 PM
నల్లమల ఎగువ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి అటవీ ప్రాంతంలోని దొంగల వాగు ఉధృతంగా ప్రవహించింది.దీంతో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఉధృతంగా ప్రవహించిన దొంగలవాగు
జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు
పెద్దదోర్నాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : నల్లమల ఎగువ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి అటవీ ప్రాంతంలోని దొంగల వాగు ఉధృతంగా ప్రవహించింది.దీంతో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. మండల పరిధిలోని కొత్తూరు వద్ద ఉన్న దొంగలవాగు ప్రవహించడంతో ఆ వాగు జాతీయ రహదారిని దాటుతూ ప్రవహిస్తోంది. అయితే దశాబ్దాల కిందట నిర్మించిన చిన్న పాటి చప్టా కావడంతో వరద నీరు రోడ్డుపై అడ్డంగా ప్రవహించడంతో ఈ సమస్య ఏర్పడింది. ఈ వరద నీరు గంటవానిపల్లె చెరువుకు చేరుతుంది. పెద్ద వర్షాలు కురిసినప్పుడల్లా ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. మండలంలో మోస్తరు వర్షం కురిసింది.రెండు గంటల పాటు సాగిన వరద ప్రవాహానికి బ్రిడ్జికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల చొప్పున వాహనాలు నిలిపోయాయి. తదనంతరం వరద తగ్గిపోవడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.