పలుచోట్ల భారీ వర్షం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:48 AM
మండల పరిధిలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చినగంజాం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కడవకుదురు గ్రామంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై వర్షపు నీరు నిలిచి చెరువును తలపించింది. రహదారిపై వర్షపునీరు నిల వడంతో ద్విచక్ర వాహనచోదకలు, పాద చారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షంకురిస్తే వారం రోజుల వరకు రహదారిపై రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని పాద చారులు పేర్కొంటున్నారు. పలు గ్రామాల్లో అంతర్గత రోడ్లపై వర్షపునీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక మండల పరిధిలో పలు ప్రాంతాల్లో పోసిన వరినారుమడులు వర్షా నికి ఎక్కడ దెబ్బతింటా యో అని రైతులు భయాందోళన చెందుతు న్నారు.
వర్షానికి తడిచిన మినప ఓదెలు
పంగులూరు : రెండురోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో మినుము రైతులలో ఆందోళన నెలకొంది. మండలంలోని పలు గ్రామాలలో 2,500 ఎకరాలలో మినుము సాగవుతోంది. కొండ మూరు, రేణంగివరం, అలవలపాడు గ్రామాలలో 300 ఎకరాలకు పైగా మినుము కోతదశకు చేరుకుందని ఏవో సుబ్బారెడ్డి తెలిపారు. కొండమూరు గ్రామం లో కొందరు రైతులు ఇప్పటికే పంటకోతకోసి నూర్పిడి కోసం పొలాలలో ఓదెలు వేసి ఉంచారు. ఆది, సోమవారాలలో కురిసిన వర్షానికి తడిసిన మినుము ఓదెలను ఏవో సుబ్బారెడ్డి సోమవారం పరిశీలించారు. మరో మూడురోజులపాటు వర్షాలు పడ తాయన్న వాతావరణశాఖ హెచ్చరి కలు మినుము రైతులను కలవ రానికి గురిచేస్తున్నాయి. వర్షం పడితే కోతకోసి ఓదెలపై ఉన్న మినుముతో పాటు కోతకువచ్చిన పంట చేతికి దక్కదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం తెల్లవారు జామువరకు మండలంలో 3.5 సెంటీమీటర్ల వర్షం పడినట్లు ఏవో సుబ్బారెడ్డి తెలిపారు.
ఆశనిరాశల మధ్య వరినాట్లు
కారంచేడు (పర్చూరు) : ఆశనిరాశల మధ్య రైతులు వరినాట్లు వేస్తున్నారు. గత ఏడాది పండిన వరికి గిట్టుబాటు ధరలేక అమ్ముకున్న వారు నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేక ఏ పంట సాగుచేయాలో అర్థంకాక భవిష్యత్‌లోనైనా నాణ్యమైన ధర లభిస్తుందన్న ఆశతో వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది వరి సాగు రైతులకు నిరాశ మిగిల్చినా, ఆశ చావక సాగువైపు కదిలారు. ప్రస్తుతం నీరు అందుబాటులో ఉండడంతో కారంచేడు మండలంలోని కుంకలమర్రు, కారంచేడు, స్వర్ణ తదితర ప్రాంతాల్లో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.