3 గంటలు భారీ వర్షం
ABN , Publish Date - May 21 , 2025 | 11:44 PM
మండలంలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి తీగలేరు వాగుకు వరదనీరు చేరింది.మండలంలోని పడమటి పల్లెలు ఎగువ చెర్లోపల్లి, నల్లగుంట్ల తదితర గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురిసాయి.
పడమటి గ్రామాల్లో కురవని వాన
చిన్న దోర్నాల చప్టాపై వరద
స్తంభించిన రాకపోకలు
చల్లబడిన వాతావరణం
పత్తి రైతులకు ఊరట
పెద్దదోర్నాల, మే 21 (ఆంధ్రజ్యోతి) : మండలంలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి తీగలేరు వాగుకు వరదనీరు చేరింది.మండలంలోని పడమటి పల్లెలు ఎగువ చెర్లోపల్లి, నల్లగుంట్ల తదితర గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురిసాయి.గంటవానిపల్లె వద్ద మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో ఎర్రవాగు, తీగలేరుకు వరద నీరు భారీ గా చేరడంతో ప్రవాహం ఉధృతి పెరిగి చిన్న దోర్నాల చప్టా వద్ద దోర్నాల - మార్కాపురం రోడ్డుపై ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత కొద్ది రోజులుగా వాతావరణం చల్లబడినా ఉష్ణోగ్రతలు తగ్గలేదు. దాంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే బుధవారం కురిసన వానతో వేసవి తాపం నుంచి బయట పడ్డారు. ఇదిలావుండగా వేసవిలో సాగు చేసిన పత్తి రైతులకు ఈ వాన ఊరట నిచ్చింది. చాలా మంది రైతులు బోరుబావుల కింద మే మొదటి వారంలోనే పత్తి సాగు చేపట్టారు. కొన్ని మొలకదశలో ఉన్నాయి. మరి కొంత పైరు పది, పదిహేను రోజుల వ్యవధి సాగులో ఉంది. ఎండల ధాటికి మొక్కలు చాలా వరకు చనిపోతున్నాయి. తెగుళ్లు బెడద, పైగా బోరు బావుల్లో కూడా భూగర్భ జలాలు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయి. ఆందోళనలో ఉన్న రైతన్నలకు వానలు ఉపశమనం కలిగించాయి. ఖరీఫ్ సాగుకు ఈ ఏడాది ముందుగానే కాలం అనుకూలంగా మారిందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పొదిలిలో మోస్తరు వాన
పొదిలి : పట్టణంలో బుధవారం ఉదయం మోస్తరు, రాత్రి భారీ వాన కురిసింది. దీంతో రహదారులపై నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి. ప్రధానంగా పలు ప్రాంతా ల్లో రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉండడంతో చిన్నిపాటి వాన పడినా నీరు నిలిచి ఇబ్బందికరంగా మారుతోంది.