Share News

భారీగా కోత

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:35 AM

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా పనులకు ఈ ఏడాది భారీగా కోతపడింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌లో పది శాతం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లకు మించి మెటీరియల్‌ కోటా పనులు మంజూరు చేయలేమని జిల్లా యంత్రాంగం తేల్చేసింది.

భారీగా కోత
ఉపాధి మెటీరియల్‌ నిధులతో నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు (ఫైల్‌)

నియోజకవర్గానికి రూ.5కోట్లు మాత్రమే!

ఉపాధి మెటీరియల్‌ కోటా పనులపై స్పష్టత ఇచ్చిన అధికార యంత్రాంగం

ముఖ్యమంత్రి హామీలు, ఎంపీ ప్రతిపాదనలకు మరో రూ.10కోట్లు

నిధుల కొరతే కారణం

గతేడాది రూ.180 కోట్లకుపైగా పనులు

గ్రామ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఉక్కిరిబిక్కిరి

పనుల అవసరం, నేత ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపికపై దృష్టి

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా పనులకు ఈ ఏడాది భారీగా కోతపడింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌లో పది శాతం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లకు మించి మెటీరియల్‌ కోటా పనులు మంజూరు చేయలేమని జిల్లా యంత్రాంగం తేల్చేసింది. కాగా పనుల ఎంపిక ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు పెద్ద సమస్యగా మారింది. ఈ పనుల కోసం గ్రామీణ ప్రాంత నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో వారు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గతేడాది రూ.180కోట్లకు పైగా పనులు ఈ పథకం కింద చేపట్టగా ఈ ఏడాది అందులో నాల్గో వంతు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కేటాయించిన నిధులకు అనుగుణంగా పనుల ప్రతిపాదన వారికి పెద్ద సమస్యగా మారింది.

ఒంగోలు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధుల్లో భారీగా కోతపడింది. అందుకు నిధుల కొరతే కారణమని తెలుస్తోంది. దీంతో ఆయా పనుల కోసం ఎదురుచూస్తున్న వారిలో నిరాశ నెలకొంది. కేవలం 10శాతం పనులే మంజూరు చేస్తున్నట్లు తెలిసి నేతలు అయోమయంలో పడ్డారు. లోటు బడ్జెట్‌ నేపథ్యంలో అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధుల మంజూరు రాష్ట్రప్రభుత్వానికి కష్టతరంగా మారిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఉపాధి హామీ వరంలా మారింది. ఈ పథకం ద్వారా ఏటా లక్షలాది కూలీలకు పనుల కల్పన వలన వందల కోట్ల రూపాయలు వేతన రూపంలో అందుతాయి. అదేసమయంలో వేతన రూపంలో ఎంత సమకూరిందో అందులో మూడింట రెండు వంతుల నిధులు మెటీరియల్‌ కోటా కింద వస్తాయి. వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు, పాఠశాలలు, క్రీడా మైదానాలు, అంగన్‌వాడీలు, పంచాయతీ, సచివాలయ, ఇతర భవన నిర్మాణాలు, శ్మశానాలు, పార్కులకు ప్రహరీలు తదితరులు అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. అలాగే మొక్కలు నాటడం, పండ్ల తోటల పెంపకం, గృహ నిర్మాణం వంటి వాటికి వాడుకునే వీలుంది. మొత్తం ఉపాధి నిధుల వ్యయంలో వేతనాలు, మెటీరియల్‌ కోటా నిధులలో 90శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక ఏడాది జిల్లాలో ఉపాధి పనుల ద్వారా రూ.300 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు లభిస్తే సుమారు రూ.200 కోట్లు మెటీరియల్‌ కోటాలో నిధులు అందుబాటులోకి వస్తాయి. అందులో 10శాతం అంటే రూ.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే మిగిలిన రూ.480 కోట్లను కేంద్రం భరిస్తుంది. అలా భారీగా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రప్రభుత్వం ఉపాధి పథకాన్ని అమలు చేయడంతోపాటు మెటీరియల్‌ కోటా పనులను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఈ విషయంలో అప్పుడు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది.

గతేడాది కూడా భారీగానే..

గతంలో 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో సుమారు రూ. వెయ్యి కోట్ల విలువైన పనులు ఈ కోటా నిధులతో చేపట్టారు. తిరిగి అధికారం చేపట్టాక కూడా భారీగానే చేశారు. గత ఏడాది అందుబాటులో ఉన్న నిధులతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.15 కోట్ల వంతున రూ.120 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రత్యేకంగా రూ.37 కోట్లతోపాటు ఎంపీ ప్రతిపాదించిన ఇతర రూపాలలో మరో రూ.20 కోట్లు కలిపి రూ.180 కోట్ల పనులు చేపట్టారు. అత్యధికం పూర్తి చేశారు. పథకాన్ని పర్యవేక్షించే డ్వామా పరిధిలో పండ్లతోటల అభివృద్ధి, మొక్కల పెంపకం, నిర్వహణ ఖర్చుల కోసం మరో రూ.50కోట్ల వరకు వెచ్చించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ కాలంలో చేసిన పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిన బిల్లులు మరో రూ.70 కోట్ల వరకు తేలాయి. అలా గత ఏడాది మొత్తం రూ.300 కోట్ల వరకు మెటీరియల్‌ కోటా కింద చెల్లింపులు చేయాల్సి వచ్చింది. అందుబాటులో ఉన్న రూ.200 కోట్లు చెల్లించారు. రూ.100 కోట్లు ఈ ఏడాది కోటా నిదుల నుంచి చెల్లించాల్సి వచ్చింది. అదేసమయంలో మరో రూ.20 కోట్లు ఈ ఏడాది డ్వామా పరిధిలో ఇతర పథకాల చెల్లింపులు చేయాల్సి వచ్చి మొత్తం పెండింగ్‌ బిల్లులు రూ. 120 కోట్లకు చేరాయి.

నిధుల లభ్యత తక్కువే

ఈ ఏడాది మెటీరియల్‌ కోటా నిధులు రూ.200కోట్లలోపుగానే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటివరకు సమారు కోటి ఐదు లక్షల పనిదినాలు ఉపాధి పథకం కింద కల్పించారు. సుమారు రూ.250 కోట్లు వేతన రూపంలో కూలీలకు లభించాయి. మార్చిలోపు మరో రూ.50కోట్ల వేతనాలు రావచ్చు. అలా రూ.300 కోట్లు వేతనాల రూపంలో వస్తే నిష్పత్తి ప్రకారం రూ.200 కోట్లు మెటీరియల్‌ కోటాలో అందుబాటులోకి వస్తాయి. అందులో ఇప్పటికే పెండింగ్‌ ఉన్న రూ.120 కోట్ల బిల్లుల చెల్లింపులు చేస్తే ఇక రూ. 80 కోట్లు మాత్రమే కొత్త వాటికి అందుబాటులో ఉంటాయి. అందులోనూ రూ.20 నుంచి 25 కోట్ల మేర పండ్లతోటల పెంపకం, హౌసింగ్‌, డ్వామా కార్యాలయ నిర్వహణ, ఇతరత్రా అవసరాలకు పోను నికరంగా రూ.50కోట్ల నుంచి రూ.55కోట్లు మాత్రమే కొత్త పనులకు ఉండనున్నాయి.

భారీగా డిమాండ్‌

ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రూ.400కోట్ల మేర పనులు మంజూరు కోరుతూ అధికారులకు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధుల నుంచి వినతులు అందాయి. దీంతో ప్రభుత్వ పెద్దల సూచనలను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్‌, డ్వామా పీడీలు నిధులు అందుబాటులో పరిశీలనకు తీసుకొని నియోజకవర్గానికి రూ.5 కోట్లు వంతున జిల్లాలోని నియోజకవర్గాల్లో రూ .40 కోట్లు విలువైన పనుల మంజూరుకు నిర్ణయించారు. సీఎం హామీలు, ఎంపీ ఇతర ప్రజాప్రతినిధుల సూచనలకు మరో రూ.10 కోట్లు ఇవ్వాలని భావించి ఆ మేరకు నేతలకు స్పష్టత ఇచ్చారు. అయితే ఈ పనుల కోసం గ్రామ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు స్థానికంగా పనుల అవసరాలు నేతల ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని పనులు ఎంపిక చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఉపాధి మెటీరియల్‌ కోటా పనుల ఎంపిక పెద్ద సమస్యగా మారింది.

Updated Date - Dec 23 , 2025 | 01:35 AM