Share News

భారీగా పెండింగ్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:13 AM

జిల్లాలో స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడంతో 64,598 పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌కార్డుల స్థానంలో రైస్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

భారీగా పెండింగ్‌

స్మార్ట్‌ రైస్‌ కార్డుల అందజేతలో ట్విస్ట్‌

డీలర్ల వద్దనే 64,598 కార్డులు

అందుబాటులో లేని లబ్ధిదారులు

ఒంగోలులోనే అధికం

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్మార్ట్‌ రైస్‌ కార్డుల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడంతో 64,598 పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌కార్డుల స్థానంలో రైస్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 6,51,820 తెల్లరేషన్‌ కార్డులు ఉండగా వాటి స్థానంలో రైస్‌కార్డుల పంపిణీని అధికారులు ప్రారంభించారు. 38 మండలాల్లో ఇప్పటివరకు 5,87,222 మంది లబ్ధిదారులకు మాత్రమే రైస్‌కార్డులను అందజేశారు. ఇంకా 64,598 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలు అర్బన్‌, రూరల్‌ మండలాల్లో 64,148 కార్డులు ఉండగా ఇప్పటివరకు 53,140 మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 11,008 మిగిలిపోయాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలులో వివిధ ప్రాంతాల నుంచి వలసదారులు గతంలో ఒకచోట ఉండి రేషన్‌కార్డు తీసుకోగా ఇప్పుడు మరొకచోటకు చేరడం, లేదా వారి సొంత ప్రాంతాలకు పోవడంతో ఎక్కువ రైస్‌కార్డులు మిగిలినట్లు సమాచారం. దర్శి మండలంలో 3,153, చీమకుర్తి మండలంలో 2,731, వైపాలెంలో 2,754, కనిగిరి మండలంలో 2,639, మార్కాపురంలో 2588, సింగరాయకొండలో 20,004, ఎన్‌జీపాడులో 1,923, గిద్దలూరులో 1838 రైస్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్‌ఎన్‌పాడు మండలంలో 1,826, పెద్దారవీడులో 1,703, పుల్లలచెరువులో 1,673, కొత్తపట్నంలో 1,621, దొనకొండలో 1,559, ముండ్లమూరులో 1,589, తాళ్లూరులో 1,474, కొండపిలో 1,442 రైస్‌కార్డులు ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది.

అయోమయంలో డీలర్లు

రేషన్‌ షాపుల వారీగా ఈ కార్డులను ప్రభుత్వం పంపింది. ఆ పరిధిలో పెండింగ్‌లో ఉండిపోయిన రైస్‌ కార్డుదారులు లేరు. దీంతో వారు ఇప్పటివరకు ఎక్కడి నుంచి రేషన్‌ తీసుకున్నారనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నా ఆ ప్రాంతంలో కార్డుదారులు లేకపోవడంతో స్మార్ట్‌ కార్డులు ప్రస్తుతం డీలర్ల వద్దనే పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 1వతేదీ నుంచి జిల్లావ్యాప్తంగా రేషన్‌ పంపిణీ ప్రారంభంకావడంతో కార్డుదారులు ఒక చోట కార్డు ఉండి మరోచోట రైస్‌కార్డ్‌ ఉండటంతో ఆ డీలర్‌ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలని సూచించారు. అలా కొంతమందికి రైస్‌ కార్డులను అందించగా మిగిలిన వాటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Nov 15 , 2025 | 01:13 AM