Share News

రూ.7వేల కోసం చంపేశాడు!

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:30 AM

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఇవ్వాల్సిన రూ.7వేల నగదు ఇవ్వలేదని కోపం పెంచుకున్నాడు. గొడ్డలితో తలపైకొట్టి, కత్తితో గొంతుపై పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఇంట్లో నగదు దొరక్కపోయేసరికి హతుడు వేలికి ఉన్న ఉంగరాన్ని అపహరించుకొని పరారయ్యాడు.

రూ.7వేల కోసం చంపేశాడు!
హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు

అప్పుగా ఇచ్చిన ఆ మొత్తం చెల్లించకపోవడమే కారణం

టంగుటూరులో సెక్యూరిటీ గార్డు హత్యకేసును ఛేదించిన పోలీసులు

వివరాలను వెల్లడించిన ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు

సింగరాయకొండ, డిసెంబరు 22 (ఆంరఽధజ్యోతి) : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఇవ్వాల్సిన రూ.7వేల నగదు ఇవ్వలేదని కోపం పెంచుకున్నాడు. గొడ్డలితో తలపైకొట్టి, కత్తితో గొంతుపై పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఇంట్లో నగదు దొరక్కపోయేసరికి హతుడు వేలికి ఉన్న ఉంగరాన్ని అపహరించుకొని పరారయ్యాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. టంగుటూరు పాతవడ్డెపాలెంలో ఈనెల 16వ తేదీ రాత్రి జరిగిన బ్యాంకు సెక్యూరిటీ గార్డు హత్యకేసును పోలీసులు ఛేదించారు. సోమవారం సింగరాయకొండ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సీఐ హజరత్తయ్య, ఎస్సైలతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన యనమలమంద వెంకటరమణయ్య (55) 25 ఏళ్ల క్రితం స్వగ్రామం నుంచి వచ్చి టంగుటూరు మండలం రావివారిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఆ తరువాత సింగరాయకొండ మండలం కలికివాయి జాతీయ రహదారి పక్కన ఉన్న ఫ్యాక్టరీలో, అనంతరం జరుగుమల్లి మండలంలోని ఒక సీఫుడ్స్‌ కంపెనీలో కూలీగా పనిచేశాడు. ఈక్రమంలో జరుగుమల్లి మండలంలోని ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన తాత ఏడుకొండలు పరిచమయ్యాడు. అప్పటి నుంచి ఇరువురూ కలిసి అప్పుడప్పుడూ మద్యం సేవిస్తూ ఉండేవారు. వెంకట రమణయ్య రెండేళ్ల క్రితం ఆ ఫ్యాక్టరీలో మానివేసి టంగుటూరులోని బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఏడుకొండలు కూడా మున్నంగిలో మానివేసి విజయవాడ లో ర్యాపిడో పని చేసుకుంటున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతో వెంకట రమణయ్య, ఏడుకొండలు నుంచి రూ.7వేలు తన అవసరాల మేరకు అప్పుగా తీసుకున్నాడు. ఆతరువాత తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని పలుమార్లు తనకి ఇవ్వాల్సిన నగదు ఇవ్వాలని అడిగినా వెంకటరమణయ్య వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలో కక్ష పెంచుకున్న ఏడుకొండలు ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలన్న నిశ్చయానికి వచ్చాడు. ఈనెల 16 తేదీ రాత్రి 7.15 గంటల సమయంలో ఏడుకొండలు వెంకటరమణయ్య ఇంటికి వచ్చాడు. అతడిని హత్యచేయడానికి సంచిలో గొడ్డలి, కత్తి తెచ్చుకున్నాడు. వెంకట రమణయ్యతో ఎప్పటిలాగే స్నేహంగా ఉంటూ అక్కడే పడుకున్నాడు. సుమారు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో వెంకట రమణయ్య నిద్రిస్తున్న సమయంలో తనవెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా తలపై కొట్టాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కత్తితో గొంతుపై నాలుగైదు సార్లు పొడిచారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు సీఐ చావా హజరత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టవర్‌డంప్‌, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సహకారంతో ఏడుకొండలను నిందితుడిగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం వావిలేటిపాడు జాతీయ రహదారిపై నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతి తక్కువు రోజుల్లో చాకచక్యంగా హత్యకేసును ఛేదించిన సీఐ చావా హజరత్తయ్య, ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, బత్తుల మహేంద్ర, బి. మహేంద్రను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Dec 23 , 2025 | 01:30 AM