Share News

ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:36 PM

జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు నియమితులయ్యారు. రాష్ట్రంలో 14 జిల్లాల ఎస్పీలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఏఆర్‌.దామోదర్‌ విజయనగరం జిల్లాకు బదిలీ చేయగా ఆ స్థానంలో ప్రస్తుతం తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న వి.హర్షవర్థన్‌ రాజును నియమించారు.

ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు
నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న హర్షవర్ధన్‌రాజు

విజయనగరం జిల్లాకు దామోదర్‌ బదిలీ

ఒంగోలు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు నియమితులయ్యారు. రాష్ట్రంలో 14 జిల్లాల ఎస్పీలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఏఆర్‌.దామోదర్‌ విజయనగరం జిల్లాకు బదిలీ చేయగా ఆ స్థానంలో ప్రస్తుతం తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న వి.హర్షవర్థన్‌ రాజును నియమించారు. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన హర్షవర్థన్‌ రాజు అనంతపురం జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్‌ చదివారు. 2013 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన అన్నమయ్య జిల్లా ఆవిర్భావం అనంతరం అక్కడ తొలి ఎస్పీగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొద్దికాలం తిరుపతిలో పనిచేశారు. తర్వాత విజయవాడ సీఐడీలో పనిచేశారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్లిన హర్షవర్థన్‌ అక్కడ వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా విభాగం నాయకుడు రవీంద్రారెడ్డి వ్యవహారంలో పోలీసులపై విమర్శలు వచ్చిన సమయంలో ఆయనను ప్రభుత్వం వీఆర్‌కు పిలిచింది.. కాగా ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో వెంకటేశ్వరస్వామి భక్తుల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అక్కడి ఎస్పీని మార్చిన ప్రభుత్వం ఆ స్థానంలో హర్షవర్థన్‌రాజును నియమించింది. అప్పటి నుంచి తిరుపతి ఎస్పీగా కొనసాగుతున్న ఆయనను తాజా బదిలీల్లో ఇక్కడి ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా ఉన్న దామోదర్‌ విజయనగరం ఎస్పీగా బదిలీ అయ్యారు. గతేడాది జూలై ఆఖరులో ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌ సుమారు 14 నెలల పాటు పనిచేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాటి ఎంపీ, ప్రస్తుత ఉప శాసనసభపతి రఘరామకృష్ణంరాజు కేసు వంటి కీలకమైన కేసుల దర్యాప్తును కూడా దామోదర్‌కు ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో పోలీస్‌ శాఖ పనితీరు మెరుగుపర్చడం, వివిధ వర్గాల వారితో సమన్వయంగా సాగడంలో వివాదాలు లేకుండా పనిచేసి పేరు తెచ్చుకున్న దామోదర్‌ కొన్ని విషయాలలో ప్రభుత్వ పెద్దల వద్ద ప్రతికూలత ఎదుర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో సంచలనం కలిగించిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల తీరుపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే కుటుంబపరమైన శుభకార్యం ఒంగోలులో నిర్వహించిన తీరుతోపాటు కొండపి నియోజకవర్గంలోని కొన్ని కేసుల విషయంలోనూ ప్రభుత్వం దృష్టికి ప్రతికూలంగా సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దామోదర్‌ బదిలీ జరిగినట్లు చర్చ సాగుతోంది.

Updated Date - Sep 13 , 2025 | 10:36 PM