కష్టపడిన నేతలకు పార్టీలో గుర్తింపు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:49 PM
పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా పార్టీ గుర్తింపునిస్తుందని టీడీపీ మార్కాపురం నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి బాజీ చౌదరి అన్నారు. శుక్రవారం స్థానిక సాయిబాలాజీ కల్యాణ మండపంలో జరిగిన మండలస్థాయి విస్త్రత సమావేంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్థానం కార్యకర్తల త్యాగాన్ని ఎప్పుడూ మరువబోదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అంతర్గత విభేదాలు పక్కన పెట్టండి
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
పొదిలి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా పార్టీ గుర్తింపునిస్తుందని టీడీపీ మార్కాపురం నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి బాజీ చౌదరి అన్నారు. శుక్రవారం స్థానిక సాయిబాలాజీ కల్యాణ మండపంలో జరిగిన మండలస్థాయి విస్త్రత సమావేంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్థానం కార్యకర్తల త్యాగాన్ని ఎప్పుడూ మరువబోదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలకు సూచించారు. టీడీపి మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి మాట్లాడుతూ 2014-19 కాలంలో చేసిన వర్కులకు బిల్లులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని, ఆ బిల్లులు ఇంతవరకు రాకపోవడంతో కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2017లో పొదిలిని నగరపంచాయతీగా చేశారని అప్పటి వైసీపీ నాయకుల స్వార్ధంకోసం కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామాలను నగరపంచాయతీలో కలిపి అన్యాయం చేశారని తెలిపారు. అప్పటి నుండి ఆయా గ్రామాల్లో కూలిపనులు కూడా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడైనా వాటిని తొలగించే విధంగా కృషి చేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ మాట్లాడుతూ సంక్షేమ పఽథకాల అమలుపై వైసీపీ నాయకులు లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వెయ్యిరూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు పడితే టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడిదని గుర్తు చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు కాటూరి పెదబాబు మాట్లాడుతూ పట్టణంలో డ్రైనేజ్ వ్యస్థను పూర్తిగా తొలగించేందుకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రసూల్, జిల్లా టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు గౌస్, మెడికల్ మెంబర్ స్వర్ణగీత, మాజీ ఎంపీటీసీ ఇమాంసా, అన్ని గ్రామాల టీడీపీ అధ్యక్షులు, బూత్‌లెవెల్ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అసమ్మతి జ్వాలలు
మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య అనైక్యత స్పష్టంగా కనిపించింది. ఈసందర్భంగా కార్యకర్తలు తమ అసమ్మతి స్వరాలను నాయకుల ఎదుట వినిపించారు. ఆదినుంచి పార్టీకోసం శ్రమించినా తమకు గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పధకాల గురించి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం, వారితో కలిసి పనులు చేసుకోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.