ఆనందం ఆవిరి
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:52 AM
నెలరోజులు ముందుగానే సాగు నీరొచ్చిందన్న ఆనందం వారం తిరగకుండానే ఆవిరైంది. సాగర్ కాలువల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహాన్ని తగ్గించి వేశారు. ఇలా ఎందుకు చేశారో అర్థంకాక ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు.
సాగర్ కాలువల్లో తగ్గిన నీటి పరిమాణం
రెండో జోన్‌కు సరఫరాను తగ్గించిన అధికారులు
భారీగా వరి నాట్లు వేస్తున్న అన్నదాతలు
కొన్నిచోట్ల నార్లు పోస్తున్న వైనం
నీరు నిలిచిపోవడంతో ఆందోళన
డ్యాంలకు వరద ఆగడంతోనే అంటూ ఇరిగేషన్ అధికారుల సమాధానం
నెలరోజులు ముందుగానే సాగు నీరొచ్చిందన్న ఆనందం వారం తిరగకుండానే ఆవిరైంది. సాగర్ కాలువల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహాన్ని తగ్గించి వేశారు. ఇలా ఎందుకు చేశారో అర్థంకాక ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు. గత వారం రోజులుగా కాలువలకు పుష్కలంగా నీరు సరఫరా అవుతుండటంతో రైతులు వరి సాగును ప్రారంభించారు. బోర్ల కింద గతంలో నార్లు పోసిన వారు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. మిగిలిన వారు నార్లు పోస్తున్నారు. ఈక్రమంలో సాగర్ కాలువల్లో నీటి పరిమాణం పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొదట్లోనే ఇదేం పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్శి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : సాగర్ కాలువల్లో శనివారం నీటి పరిమాణం గణనీయంగా పడిపోయింది. ఒక్కసారిగా సరఫరా తగ్గిపోవటంతో ముమ్మరంగా వరినాట్లు వేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.5 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంది. అందులో దర్శి ఎన్‌ఎస్‌పీ డివిజన్ పరిధిలోనే లక్ష ఎకరాలు ఉంది. సాధారణంగా దర్శి డివిజన్‌లో 60శాతం భూముల్లో వరి సాగు చేస్తారు. మిగిలిన భూముల్లో ఆరుతడి పంటలు వేస్తారు. ఈఏడాది ముందుగానే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిగా నిండటంతో రైతులు ఎంతో ఆనందపడ్డారు. ఎగువన వరదలు కొనసాగడంతో అధికారులు సాగర్ కాలువలకు కూడా నిండుగా నీరు వదిలారు. ప్రస్తుతం ప్రవాహం తగ్గడంతో సరఫరాను తగ్గించారు.
నెలాఖరుకు రెండో జోన్‌కు నీరు విడుదల
సాగర్ కుడి కాలువ పరిధిలోని రెండో జోన్‌కు అనగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఈనెల చివరి వారంలో కానీ, సెప్టెంబరు మొదటి వారంలో కానీ సాగుకు అధికారికంగా నీరు విడుదల చేయడం జరుగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వదిలింది వరద నీరు అని స్పష్టం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు సాగర్ నీటి పంపిణీ వాటాలను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంది. సాగర్ కుడి కాలువకు ప్రభుత్వం 132 టీఎంసీల నీటిని కేటాయించింది. అందులో మొదటి జోన్‌కు 57శాతం, రెండో జోన్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశంకు 43శాతం నీరు సరఫరా చేస్తారు. ఈ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు తొలి జోన్‌కు విడుదల చేసిన నెలరోజుల తర్వాత రెండో జోన్‌కు సరఫరా చేస్తారు. అందుకు అనుగుణంగానే ఆగస్టు చివరి వారంలో కానీ, సెప్టెంబరు మొదటి వారంలోకానీ రెండవ జోన్‌కు అధికారికంగా నీరు విడుదల చేసి మార్చి వరకు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
గుంటూరుకు మాత్రమే సాగునీరు
ప్రస్తుతం సాగర్ కాలువలకు ఎందుకు నీరు విడుదల చేశారని అధికారులను అడగ్గా వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తుండటంతో మంచినీటి చెరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పుడు వరద నీరు తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలు వద్ద (ప్రకాశం బార్డర్) నీటి పరిమాణం పూర్తిగా తగ్గించినట్లు చెప్పారు. ప్రస్తుతం మొదటి జోన్ పరిధిలోని గుంటూరు జిల్లాకు మాత్రమే పంటల సాగుకు నీరందిస్తున్నట్లు తెలిపారు. రెండో జోన్‌కు ఈనెల చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో నీరు విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈవిషయాన్ని అధికారులు ముందుగానే తెలపకపోవడంతో కాలువలకు పుష్కలంగా రోజులు తరబడి నీరు సరఫరా కావడంతో సాగుకు నీరు విడుదల చేశారనే ఉద్దేశంతో రైతులు ముమ్మరంగా వరినాట్లు వేసే కార్యక్రమం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో సాగర్ జలాల సరఫరా ఆపివేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.