గురువా.. స్పందనేది!
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:39 AM
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిభావంతులైన టీచర్లను ఎంపిక చేసి గురుపూజోత్సవం రోజున వారికి అవార్డులు ప్రదానం చేసి గౌరవించడం ఆనవాయితీ.
అంతంతమాత్రంగానే పోటీ
60 ఉత్తమ టీచర్ అవార్డులకు 56 దరఖాస్తులు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 2 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిభావంతులైన టీచర్లను ఎంపిక చేసి గురుపూజోత్సవం రోజున వారికి అవార్డులు ప్రదానం చేసి గౌరవించడం ఆనవాయితీ. ఈ అవార్డుల పొందిన వారికి సమాజంలో గుర్తింపు, గౌరవం చూసి టీచర్లు పోటీ పడుతుంటారు. అవసర మైతే రాజకీయ నాయకులు, అధికారులతో సిఫార్సులు కూడా చేయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు టీచర్లు ముందుకు రావడం లేదు. గతంలో దరఖాస్తు చేసేందుకు కనీసం వారం పదిరోజులు ముందు డీఈవోలు పత్రికా ప్రకటన ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం డీఈవో 22న ప్రకటన విడుదల చేసి 23 నాటికి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఒకరోజు సమయంలో అన్ని సమకూర్చుకోలేక కొందరు టీచర్లు మానుకున్నట్లు తెలుస్తోంది.
నలుగురే హెచ్‌ఎంలు దరఖాస్తు
జిల్లాస్థాయిలో పది మంది ప్రధానోపాధ్యాయులు, 20మంది స్కూలు అసిస్టెంట్లు, 30 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే హెచ్‌ఎంల నుంచి కేవలం నాలుగు, ఎస్‌జీటీల నుంచి 19 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. స్కూలు అసిస్టెంట్ల నుంచి 33 దరఖాస్తులు అందాయి. జిల్లాస్థాయి కమిటీ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం కూడా దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
గురుపూజోత్సవ ఏర్పాట్లకు కమిటీలు
ఈనెల 5న నిర్వహించనున్న గురుపూజోత్సవం సందర్భంగా టీచర్లకు జిల్లాస్థాయి అవార్డుల ప్రదానోత్సవ ఏర్పాట్లకు 46 మందితో మూడు కమిటీలను నియమించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 15 మంది ఎంఈవోలు, హెచ్‌ఎంలతో ఆహ్వాన కమిటీ, 20 మంది స్కూలు అసిస్టెంట్లతో కార్యనిర్వాహక కమిటీ, 11 మంది ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలతో క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ కమిటీల్లోని సభ్యులతో బుధవారం స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
----------------------------------------------