కీలక రంగాలపై దిశానిర్దేశం
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:33 AM
అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కీలక రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు దిశానిర్దేశం చేశారు. సోమ, మంగళవారాల్లో ఈ సదస్సు జరిగింది. స్థూల ఉత్పత్తి, పరిశ్రమలు, విద్య, వైద్యం, స్థానిక సంస్థల నిర్వహణ, రెవెన్యూ వంటి వాటితోపాటు శాంతిభద్రతలపైనా సమీక్ష నిర్వహించారు.
ముగిసిన కలెక్టర్ల సదస్సు
రెండోరోజు శాంతి భద్రతలపై సమీక్ష
హాజరైన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు
పలు అంశాలపై స్పష్టమైన చర్యలకు సీఎం ఆదేశం
ఒంగోలు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కీలక రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు దిశానిర్దేశం చేశారు. సోమ, మంగళవారాల్లో ఈ సదస్సు జరిగింది. స్థూల ఉత్పత్తి, పరిశ్రమలు, విద్య, వైద్యం, స్థానిక సంస్థల నిర్వహణ, రెవెన్యూ వంటి వాటితోపాటు శాంతిభద్రతలపైనా సమీక్ష నిర్వహించారు. గతంలో కలెక్టర్లు తమ జిల్లాల్లో పథకాల అమలు, అబివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యలపై నివేదికలు సమర్పించే వారు. కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రత్యక్షంగా వివరించే వారు. ఈసారి అందుకు భిన్నంగా ఆయారంగాల వారీ రాష్ట్రస్థాయి పురోగతికి సంబంధించి ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, సెక్రట రీల స్థాయి అధికారులు వివరించారు. సందర్భానుసారం అవసర మైన కలెక్టర్లకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈసదస్సుకు రెండు, మూడు రోజులు ముందుగానే పెద్ద సంఖ్యలో కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయడంతో కొత్తవారికి తమ జిల్లాలపై పెద్దగా అవగాహన ఉండదు కనుక ఈ విడత సదస్సును అలా నిర్వహించారు.
రెవెన్యూ లోపాలపై తీవ్రంగా స్పందించిన సీఎం
తొలిరోజు స్థూల ఉత్పత్తి పెంపు ప్రధానాంశంగా సమావేశంలో చర్చ నడిచింది. రెండోరోజు రెవెన్యూ, స్థానిక సంస్థల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖలో లోపాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. భూ సమస్యల పరిష్కారంలో మరింత క్రియాశీలకంగా పనిచేయల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కలెక్టర్ తమ సమయంలో పదిశాతం వాటి కోసం పనిచేయాలని చెప్పారు. అలాగే ఇసుక, లిక్కర్ విషయాల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సదస్సులో జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్ పి.రాజాబాబు పాల్గొన్నారు. ఇక్కడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులు మాత్రమే కావడంతో కలెక్టర్ రాజాబాబు ప్రత్యక్షంగా సమావేశంలో మాట్లాడే అవకాశం తీసుకోలేదని సమాచారం. మంగళవారం సాయంత్రం శాంతిభద్రతలపై జరిగిన సమీక్షకు జిల్లా నూతన ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు కూడా హాజరయ్యారు.