సచివాలయాల్లో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Nov 19 , 2025 | 01:21 AM
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయాలు ఏర్పాటుచేసిన తర్వాత అంతర్ జిల్లాల బదిలీలు జరగలేదు.
స్పౌజ్ విభాగానికే పరిమితం
ఈ నెలాఖరులోపు ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయాలు ఏర్పాటుచేసిన తర్వాత అంతర్ జిల్లాల బదిలీలు జరగలేదు. నియామకాల సమయంలో జిల్లాకు చెందిన అభ్యర్థులు ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు పొందగా, ఇతర జిల్లాల వారు కూడా ఇక్కడ కొలువులు పొందారు. అలాంటి వారిని స్సౌజ్ కేటగిరీ కింద బదిలీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం బదిలీ కోరుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల భార్య/భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతేనే అర్హులు. ఇద్దరిలో ఒకరు ప్రైవేటు ఉద్యోగైతే ఇది వర్తించదు. ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకొని ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఖాళీల జాబితాను ఆయా శాఖల అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఉద్యోగులకు ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. సిబ్బంది ఆయా ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్ల వద్ద నోడ్యూ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆయా జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.