అదనపు పొగాకు కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:54 PM
పొగాకు అదనపు పంట కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరిమితంగా అదనపు సర్వీసు చార్జీలు విధించింది. దీనివలన దక్షణాదిలోని రైతులపై సుమారు రూ.50 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా పొగాకు బోర్డు అనుమతించిన దానికన్నా అధికంగా పండిన పంటపై ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణంగా వసూలు చేసే ఒక శాతం సర్వీసు చార్జీతోనే కొనుగోలు చేశారు. ఈసారి (2024-25)లో పంట దిగుబడి భారీగా పెరగడంతో రానున్న సీజన్‌లో పంట ఉత్పత్తి నియంత్రణఫై పొగాకు బోర్డు, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలు దృష్టి సారించాయి. రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిమితంగానైనా అదనపు సర్వీసు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించాయి.
పరిమితంగానే సర్వీసు చార్జీ విధింపు
20శాతం మించితే 3శాతంతోపాటు
కిలోకు రూపాయి వసూలు
దక్షిణాది రైతులపై రూ.50 కోట్ల మేర భారం
అనుమతి లేని పంటపై ఆరు శాతం విధింపు
ఆగిన కేంద్రాల్లో వేలం పునఃప్రారంభం
పొగాకు అదనపు పంట కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరిమితంగా అదనపు సర్వీసు చార్జీలు విధించింది. దీనివలన దక్షణాదిలోని రైతులపై సుమారు రూ.50 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా పొగాకు బోర్డు అనుమతించిన దానికన్నా అధికంగా పండిన పంటపై ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణంగా వసూలు చేసే ఒక శాతం సర్వీసు చార్జీతోనే కొనుగోలు చేశారు. ఈసారి (2024-25)లో పంట దిగుబడి భారీగా పెరగడంతో రానున్న సీజన్‌లో పంట ఉత్పత్తి నియంత్రణఫై పొగాకు బోర్డు, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలు దృష్టి సారించాయి. రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిమితంగానైనా అదనపు సర్వీసు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించాయి.
ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్న ఈ సీజన్ (2024-25)లో పొగాకు పంట ఉత్పత్తి భారీగా పెరిగింది. 167 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా సుమారు 240 మిలియన్ కిలోల మేర పండినట్లు అంచనా. అందులో దక్షిణాదిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 11 వేలం కేంద్రాల పరిధిలో 105 మిలియన్ కిలోలకు అనుమతి ఇవ్వగా దాదాపు 160 మిలియన్ కిలోల మేర పంట ఉత్పత్తి అయినట్లు సమాచారం. అలా భారీగా పంటపెరగడంతోపాటు ప్రస్తుత సీజన్‌లో ధరలు కూడా గతంలో వలే లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌లో పంట ఉత్పత్తి నియంత్రణఫై మళ్లీ పొగాకు బోర్డు, కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖలు దృష్టి సారించాయి.
రైతుల అభిప్రాయాల సేకరణ
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు మూడు నెలల క్రితం పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు. నెలన్నర క్రితం వాణిజ్యశాఖ మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో వ్యాపార, రైతు ప్రతినిధులు, అధికారులతోనూ సమీక్ష చేశారు. ఆ సందర్భంగా రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిమితంగానైనా అదనపు సర్వీసు చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వేలం కేంద్రాల వారీగా నిర్వహించిన రైతు కమిటీల సమావేశాలలో అదనపు పంట కొనుగోళ్లపై 2నుంచి 3శాతం అదనపు సర్వీసు చార్జీల వసూలుకు రైతు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదనపు పంట కొనుగోళ్లపై అనుమతి కోసం నెలన్నర క్రితం బోర్డు అధికారులు వాణిజ్య మంత్రిత్వ శాఖను సంప్రదించారు.
ఆరు వేలం కేంద్రాల్లో అధికారిక కొనుగోళ్లు పూర్తి
అదనపు పంట కొనుగోలు అంశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో పలు వేలం కేంద్రాలలో అధికారిక పంట కొనుగోలు పూర్తయి వాటిలో కొనుగోళ్లను ఆపేయాల్సి వచ్చింది. అలా దక్షిణాదిలో ఉన్న 11 వేలం కేంద్రాలలో ఏకంగా ఆరుచోట్ల అధికారిక పంట కొనుగోళ్లు పూర్తయి వేలం నిలిచింది. ఈ నేపథ్యంలో అదనపు పంట కొనుగోళ్లకు పరిమిత అదనపు సర్వీసు చార్జీలతో కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది.
అదనపు చార్జీల వసూలు ఇలా..
కేంద్రం విధించిన అదనపు చార్జీలను పరిశీలిస్తే అనుమతించిన పంట కన్నా 10శాతం ఎక్కువ పంట వరకు ప్రస్తుతం సాధారణంగా వసూలు చేసే ఒక శాతం చార్జీ తప్ప ఎలాంటి అదనపు సర్వీసు చార్జీ వసూలు చేయరు. అదే 10నుంచి 20శాతం వరకు ఉంటే ప్రస్తుతం వసూలు చేసే ఒక శాతం సాధారణ సర్వీసు చార్జీతోపాటు అదనంగా 2శాతం, అలాగే కిలోకు ఒక రూపాయి పెనాల్టీ వసూలు చేస్తారు. 20శాతం కన్నా పైన ఉంటే 3శాతం అదనపు సర్వీసు చార్జీ, కిలోకు ఒక రూపాయి పెనాల్టీ విధించారు.
55 మిలియన్ కిలోలు అధికంగా ఉత్పత్తి
ప్రస్తుత సీజన్‌లో బోర్డు అధికారుల అంచనా ప్రకారం చూస్తే అనుమతి ఇచ్చిన పంట కన్నా సుమారు 55 మిలియన్ కిలోల పంట అధికంగా పండింది. తాజా నిర్ణయం ప్రకారం ఆ 55 మిలియన్ కిలోల పంటలో 10శాతం పోను మిగిలిన 49.50 మిలియన్ పంటకు రైతులు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం రైతులు సుమరు రూ.50 కోట్ల మేర అదనపు చార్జీల రూపంలో పొగాకు బోర్డుకు చెల్లించాలి. అంటే ఆమేర రైతులపై భారం పడి బోర్డుకు లాభం చేకూరనుంది.
నేటి నుంచి కొనుగోళ్ల పునఃప్రారంభానికి ఏర్పాట్లు
దక్షిణాదిలోని అన్ని వేలం కేంద్రాల్లో అదనపు పంట కొనుగోళ్లకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రైతులు తమ వద్ద సుమారు ఎంత మేర అదనంగా పంట ఉందన్న విషయాన్ని బోర్డు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన దరఖాస్తులను సంబంధించి క్లస్టర్ ఫీల్డ్ ఆఫీసన్ల వద్ద అందజేయాలని పొగాకు బోర్డు ఆర్‌ఎం రామారావు తెలిపారు. తద్వారా రైతుల వద్ద ఉన్న అదనపు పంట సమగ్ర సమాచారం తమకు అందుతుందని, తదనుగుణంగా బేళ్లకు రోజువారీ అనుమతి ఇచ్చి త్వరితగతిన కొనుగోళ్లకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.