Share News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

ABN , Publish Date - Aug 06 , 2025 | 10:52 PM

అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఒంగోలులో బుధవారం కలెక్టర్‌ తమీమ్‌అన్సారియాను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
నిధులు విడుదల చేయాలని కోరుతున్న టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ లక్ష్మి

కలెక్టర్‌ను కలిసి కోరిన దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఒంగోలులో బుధవారం కలెక్టర్‌ తమీమ్‌అన్సారియాను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆరంభించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసినందుకు, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నందుకు కలెక్టర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దర్శి. దొనకొండ, కురిచేడు మండలాలకు తాగునీరు అందించే ఎన్‌ఏపీ పథకాల ఫిల్టర్‌బెడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. మొత్తం తొమ్మిది ఉండగా కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. సుమారు 46 ఏళ్ల క్రితం నిర్మించిన పథకం మధ్యలో ఫిల్టర్‌బెడ్లు మరమ్మతులు చేయని కారణంగా నిర్వీర్యమయాయయని వివరించారు. వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రూ.17 కోట్ల నిధులతో చేపట్టనున్న డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణంకు నిధులు విడుదల అయ్యేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. అంతర్గత రోడ్లు, కాల్వల నిర్మాణం, దర్వి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆటస్థలం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్‌ లక్ష్మీ తెలిపారు. తూర్పువీరాయపాలెం, సామంతపూడి రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి నిధులు విడుదల, అర్హులైన 90 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన మేరకు తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపినట్లు ఆమె వివరించారు. దొనకొండ మండలంలోని ఆరవళ్లిపాడు గ్రామానికి చెందిన 130 మందికి సాంకేతిక కారణాల వలన తల్లికి వందనం నిధులు అందని విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే పరిష్కారం చూపినట్లు తెలిపారు. ఆమె వెంట టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి నాగులపాటి శివకోటేశ్వరరావు, నవులూరి విద్యాసాగర్‌ ఉన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 10:52 PM