Share News

గ్రానైట్‌ డొంకదారి అధ్వానం

ABN , Publish Date - Dec 15 , 2025 | 10:38 PM

కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగే గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. గ్రానైట్‌ బూడిదతో నిండిన రహదారిలో నుంచి వెళ్లాల్సిందే. కార్లు లాంటి వాహనాలు అయితే ఫర్వాలేదుగాని, ద్విచక్రవాహనదారులు వెళ్లాలంటే గ్రానైట్‌ దుమ్ముతో మునిగిపోవలసిందే.

గ్రానైట్‌ డొంకదారి అధ్వానం
గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న రాజుపాలెం డొంక రోడ్డు ఇలా...

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తారు రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

ఆ తర్వాత పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

ప్రస్తుతం రహదారి మరింత ఛిద్రం

రావడం మానేసిన బయ్యర్లు, ట్రేడర్లు

మార్టూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగే గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. గ్రానైట్‌ బూడిదతో నిండిన రహదారిలో నుంచి వెళ్లాల్సిందే. కార్లు లాంటి వాహనాలు అయితే ఫర్వాలేదుగాని, ద్విచక్రవాహనదారులు వెళ్లాలంటే గ్రానైట్‌ దుమ్ముతో మునిగిపోవలసిందే. వివరాల్లోకెళ్తే...

మార్టూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం డొంకలో 50కు పైగా గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్‌ వ్యాపారం ఆరంభంలోనే ఈ రహదారిలో గ్రానైట్‌ పరిశ్రమలు వెలిశాయి. వీటి నుంచి స్టీల్‌ గ్రే రకం గ్రానైట్‌ శ్ల్లాబులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. రోజూ గ్రానైట్‌ ట్రేడర్లు, బయ్యర్లు, కార్మికులతో డొంకరోడ్డు సందడిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మట్టిరోడ్డు కావడం, అంతా గ్రానైట్‌ బూడిదతో నిండి ఉండటం, కంకరరాళ్లు ఉండటంతో గ్రానైట్‌ ట్రేడర్లు కూడా గ్రానైట్‌ పరిశ్రమల వద్దకు రావడం తగ్గుముఖం పట్టిందని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. రోజూ ఏదో ఒక గ్రానైట్‌ పరిశ్రమ నుంచి గ్రానైట్‌ శ్లాబులను కొనుగోలు చేసి, లారీలలో వాటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అదేవిధంగా గురిజేపల్లి, సంతమాగులూరులోని గ్రానైట్‌ క్వారీల నుంచి ముడిరాయి గ్రానైట్‌ పరిశ్రమలకు వస్తుంది. దాంతో రోడ్డు మరింతగా చెడిపోతోందని, వర్షం కురిస్తే రోడ్డు గుండా గ్రానైట్‌ లారీలు వెళ్లడం ఇబ్బందిగా ఉందని ట్రేడర్లు సైతం చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గతంలో రద్దీగా కనిపించే గ్రానైట్‌ పరిశ్రమలలో ప్రస్తుతం బయ్యర్లు సక్రమంగా రావడం లేదని సమాచారం.

గతంలో 2017లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డొంకదారిలో తారురోడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరయ్యాయి. కాని పనులు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో గ్రానైట్‌ పరిశ్రమలను అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకున్న నాయకులు రోడ్డు నిర్మాణం సంగతి పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో రోడ్డు నిర్మాణం జరుగుతుందని గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు కొండంత ఆశగా ఉన్నారు. మట్టిరోడ్డు తారురోడ్డుగా మారితే గ్రానైట్‌ వ్యాపారం పుంజుకుంటుందని, మరికొన్ని గ్రానైట్‌ పరిశ్రమలు కొత్తరూపు సంతరించుకుంటాయని యజమానులు, వ్యాపారులు, ట్రేడర్లు అంటున్నారు. దానికితోడు రహదారికి దగ్గరగా రాజుపాలెం కూడలి వద్ద పెద్ద అండరుపాస్‌ నిర్మాణం జరుగుతుండటంతో, గ్రానైట్‌ క్వారీల నుంచి ముడిరాయి తెచ్చేలారీలు సజావుగా పరిశ్రమలకు వస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు.

Updated Date - Dec 15 , 2025 | 10:38 PM